తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రెండో రోజూ బిజీ బిజీగా గడుపుతున్నారు. శుక్రవారం ఉదయం కాంగ్రెస్ అధిష్టానం నేతలతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. అనంతరం పార్టీ వ్యవహారాలు, మంత్రివర్గ విస్తరణ అంశాలపై హై కమాండ్‌తో చర్చించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నట్లు సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, గ్రాంట్లపై ఆర్థిక మంత్రితో చర్చించనున్నారు.
అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మధ్యాహ్నం 1:15 గంటలకు సమావేశం కానున్నారు.అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల గురించి వివిధ అంశాలపై సంబంధిత కేంద్ర మంత్రులతో కూడా రేవంత్ భేటీ కానున్నారని తెలుస్తోంది. ఇదిలాఉండగా, గురువారం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో ఆయన భేటీ అయిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి పనులకు నిధుల మంజూరీపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలిసింది.