ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ లోనే అంతర్గత కుమ్ములాటలు నడిచాయి…కానీ ఇప్పుడు అధికార టీఆర్ఎస్ లో కలహాలు మొదలయ్యాయి. పార్టీలో నాయకులు లిమిటెడ్ గా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాలేదు…కానీ ఎప్పుడైతే ఇతర పార్టీలు ఉండకూడదని చెప్పి కేసీఆర్ పెద్ద ఎత్తున కాంగ్రెస్, టీడీపీ నాయకులని పార్టీలో చేర్చుకున్నారో అప్పటినుంచి రచ్చ మొదలైంది. ఊహించని విధంగా నాయకుల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఈ పోరు కాస్త రాను రాను పెద్దగా అవుతూ వస్తుంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో నాయకుల మధ్య గొడవలు నడుస్తున్నాయి. ఏదో అధికార, ప్రతిపక్ష నేతలు మాదిరిగా అధికార పక్ష నాయకులు ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు.
మెజారిటీ నియోజకవర్గాల్లో కారు నేతల మధ్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పోరులో పైచేయి సాధించిన నేతలు టీఆర్ఎస్ లో ఆధిపత్యం చెలాయిస్తుండగా, పోరులో తట్టుకోలేని వారు టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చి బయటకొచ్చేస్తున్నారు. ఇలా బయటకొచ్చేవారిని కాంగ్రెస్ పార్టీ చేరదీస్తుంది. ఇప్పటివరకు కాంగ్రెస్ నేతలు, టీఆర్ఎస్ లోకి వెళ్ళగా, ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి వస్తున్నారు.
అయితే టీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్న నాయకులని లాగడంలో బీజేపీ వెనుకబడింది…కాంగ్రెస్ మాత్రం కారులో ఉన్న లుకలుకలని క్యాష్ చేసుకుంటుంది. ఇప్పటికే చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. అక్కడ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పడక ఓదేలు టీఆర్ఎస్ ని వదిలేసి కాంగ్రెస్ లోకి వచ్చారు.
ఇక ఖైరతాబాద్ లో దానం నాగేందర్ తో పొసగక పీజేఆర్ వారసురాలు విజయారెడ్డి టీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక అశ్వరావుపేటలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సైతం టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి, కాంగ్రెస్ లో చేరుతున్నారు. వీరే కాదు…ఇంకా కొందరు నాయకులు కారు దిగి హస్తం పార్టీలోకి రానున్నారు.