రంపచోడవరం నియోజకవర్గంకు సంబంధించి ఇటీవల నిర్వహించిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీలో ఓ వివాదం చోటు చేసుకుంది. ఆ ప్లీనరీలో వివాదాస్పద నేత భజనకే కార్యకర్తలు పరిమితం అయ్యారు అని, ఎవ్వరూ ప్రజా సమస్యలపై మాట్లాడలేదని అక్కడి టీడీపీ నాయకులు ఆరోపిస్తూ..ఎమ్మెల్సీ పనితీరు గతంలో ఏ విధంగా ఉండేదో, ఇప్పుడు ఏవిధంగా ఉన్నదో అన్నవి కూడా వివరిస్తూ టీడీపీ విస్తృత ప్రచారం ఒకటి చేసేందుకు మొగ్గు చూపుతోంది.
ఈ నేపథ్యాన మన్యం వాకిట ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ (అనంత బాబు) కు సంబంధించి రోజుకో ఆరోపణ వెలుగుచూస్తోంది. డ్రైవర్ హత్యోదంతంపై ఆయన అరెస్టు అయి, ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న ఆయనపై మరికొన్ని విమర్శలూ రేగుతున్నాయి. ఆయన కారణంగా ఇబ్బంది అప్పటి ఎమ్మెల్యే (రంపచోడవరం నియోజకవర్గం) వంతల రాజేశ్వరి మీడియా ముందుకు వచ్చారు.అనంతబాబు వేధింపులు తట్టుకోలేకే తాను టీడీపీ గూటికి చేరానని చెప్పారామె. తన వేతనాన్ని సైతం ఆయన లాక్కొనే వాడని చెప్పారామె. డబ్బుకు ఆశ పడి తాను టీడీపీలో చేరానని చెప్పడం కూడా భావ్యంగా లేదని అంటున్నారామె. ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు చర్చకు తావిస్తున్నాయి.
వాస్తవానికి ఇప్పటి ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మిని కూడా అనంతబాబే శాసిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన చేతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు కీలుబొమ్మలుగా ఉంటున్నారన్న వాదనలూ ఉన్నాయి. డ్రైవర్ హత్య తరువాత కూడా ఆయన అనుచరులు ఏజెన్సీలో అరాచకాలు ఆపడం లేదని కూడా తెలుస్తోంది. అయితే అనంత బాబు కు మద్దతు ఇచ్చే విధంగా వైసీపీ నేతల చర్యలు కూడా ఉండడం విస్మయకరం.ఆయన చిత్ర పటానికి క్షీరాభిషేకాలు చేయడం కూడా విచిత్రకరం. ఇన్ని జరుగుతున్నా అధిష్టానం వీటిని అడ్డుకోకపోవడం విచారకరం అని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఓ హత్య కేసులో నిందితుడికి ఏ విధంగా క్షీరాభిషేకాలు చేస్తారు అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది.