న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ బ్రెండన్ మెకల్లమ్ గురించి క్రికెట్ లవర్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కివీస్ నుంచి వచ్చిన స్టార్ ఆటగాళ్లలో మెకల్లమ్ ఒకరు. తన విధ్వంసకర ఇన్నింగ్స్ లతో అభిమానులను సంపాదించుకున్నాడు. క్రీజులోకి వచ్చాడంటే ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా సరే వణికిపోవాల్సింది. అంతలా భయపెట్టాడు ఈ న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి సెంచరీ చేసింది కూడా బ్రెండన్ మెలకల్లమ్ దే. 2008 ఐపీఎల్ తొలిసీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరుపున ఆడిన మెలకల్లమ్ ఆర్సీబీపై కేవలం 73 బాల్స్ లోనే 158 పరుగులు చేశాడు.
ఇదిలా ఉంటే ఇంతటి విధ్వంసక ఆటగాడు త్వరలోనే ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కోచ్ గా పనిచేయబోతున్నాడని తెలిసింది. ఇంగ్లీష్ క్రికెట్ టీమ్ టెస్ట్ కోచ్ గా ఎంపిక అయినట్లు బీబీసీ, బ్రిటీష్ మీడియా తెలిపాయి. దీనిపై త్వరలోనే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ అధికారిక ప్రకటన చేయనుంది. ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్ కోల్పోవడంతో అప్పటి కోచ్ సిల్వర్ వుడ్ ఫిబ్రవరిలో రాజీనామా చేశాడు. కోచ్ పదవి కోసం కాలింగ్ వుడ్, జాంటీ రోడ్స్, మెకల్లమ్ పోటీ పడ్డారు.