హిమాచల్ ప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. 68 మంది సభ్యులు ఉన్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో 40 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ.. 25 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ రాజ్యసభ స్థానాన్ని దక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది.కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు 34 చొప్పున ఓట్లు వచ్చాయి.
డ్రాలో బీజేపీ అభ్యర్థి హర్షమహాజన్ విజయం సాధించారు.హిమాచల్ ప్రదేశ్‌లోని ఒకే ఒక్క రాజ్యసభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీ ఓడిపోయారు. బీజేపీకి అనుకూలంగా ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్లు ఓటు వేశారు.అయితే, ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ఫలితాలన్ని ప్రకటించాల్సి ఉంది.మరోవైపు హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సుఖు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఆరుగురు ఎమ్మెల్యేలను బీజేపీ హర్యానా రాష్ట్రానికి తీసుకెళ్ళిందని ఆరోపించాడు. బీజేపీ పోలింగ్ అధికారుల్ని బెదిరించిందని ,ఇది ప్రజాస్వామ్యానికి సరికాదని అన్నారు.