కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్.. ఒకటేనా?.. వాటి బారిన పడినప్పుడు ఏం చేయాలి..?

-

గుండె పోటు.. ఇటీవల చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు అందర్నీ భయపెడుతోంది. ముఖ్యంగా యుక్త వయస్సులో ఉన్నవాళ్లు అకస్మాత్తుగా ఉన్న చోటే కుప్పకూలిపోతున్నారు. క్షణాల్లోనే ప్రాణాలు వదులుతున్నారు. దీనికి హఠాత్తుగా గుండె స్తంభించటం (కార్డియాక్‌ అరెస్ట్‌), గుండెపోటు (హార్ట్‌ ఎటాక్‌) కారణం కావొచ్చు. చాలామంది రెండూ ఒకటేనని భావిస్తుంటారు. నిజానికివి వేర్వేరు సమస్యలు.

కార్డియాక్‌ అరెస్ట్‌ అంటే?

గుండె పనితీరు అస్తవ్యవస్తమై, హఠాత్తుగా కొట్టుకోవటం ఆగటాన్ని కార్డియాక్‌ అరెస్ట్‌ అంటారు. దీన్ని ఒకరకంగా ఇంట్లో విద్యుత్‌ తీగల్లో తలెత్తే షార్ట్‌ సర్క్యూట్‌తో పోల్చుకోవచ్చు. గుండెలోని విద్యుత్‌ వ్యవస్థ గతి తప్పటం ద్వారా కార్డియాక్‌ అరెస్ట్‌ ప్రేరేపితమవుతుంది. గుండె రక్తాన్ని పంప్‌ చేసే ప్రక్రియ దెబ్బతింటుంది. అప్పుడు మెదడు, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు గుండె రక్తాన్ని పంప్‌ చేయలేక చతికిల పడుతుంది.

ఏం జరుగుతుంది?

గుండె స్తంభించిన మరుక్షణమే వ్యక్తి స్పృహ కోల్పోతాడు. శ్వాస ఆగుతుంది. లేదూ ఎగపోస్తున్నట్టు కనిపించొచ్చు. తక్షణం చికిత్స అందకపోతే నిమిషాల్లోనే ప్రాణాపాయం సంభవించొచ్చు.

ఏం చేయాలి?

కార్డియాక్‌ అరెస్ట్‌ వచ్చిన కొద్ది నిమిషాల్లోపు చికిత్స అందితే కోలుకునే అవకాశముంది. ఆటోమేటెడ్‌ ఎక్స్‌టర్నల్‌ డిఫ్రిబిలేటర్‌ (ఏఈడీ) అందుబాటులో ఉంటే వెంటనే ఉపయోగించాలి. దీన్ని ఛాతీకి తాకిస్తే గుండెకు విద్యుత్‌ షాక్‌ తగిలి, తిరిగి కొట్టుకుంటుంది. లేకపోతే సీపీఆర్‌ చేయాలి. ఛాతీ మధ్యలో అరచేతితో పదే పదే గట్టిగా నొక్కుతూ, పైకి తీయాల్సి ఉంటుంది. ఇది గుండె తిరిగి కొట్టుకోవటానికి సాయం చేస్తుంది.

గుండెపోటు అంటే?

గుండెకు రక్త ప్రసరణ ఆగినప్పుడు గుండెపోటు తలెత్తుతుంది. దీన్ని నీటి గొట్టాల్లో ఏర్పడే అడ్డంకిగా అనుకోవచ్చు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనిలో పూడికలు ఏర్పడినప్పుడు రక్త ప్రసరణ దెబ్బతింటుంది. పూడిక రక్తనాళాన్ని పూర్తిగా మూసేస్తే ఆ భాగానికి ఆక్సిజన్‌తో కూడిన రక్త సరఫరా నిలిచిపోతుంది. పూడికను వెంటనే తొలగించి, రక్తనాళాన్ని తిరిగి తెరవకపోతే గుండె కండరం క్షీణించటం మొదలవుతుంది.

ఏం జరుగుతుంది?

గుండెపోటు బారినపడ్డవారిలో ఛాతీలో, ఛాతీ పైభాగంలో తీవ్రమైన నొప్పి.. అసౌకర్యం, శ్వాస సరిగా తీసుకోలేకపోవటం, చల్లటి చెమటలు పట్టటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స అందటం ఎంత ఆలస్యమైతే గుండె అంత ఎక్కువగా దెబ్బతింటూ వస్తుంది.

ఏం చేయాలి..?

గుండెపోటు లక్షణాలు కనిపించిన వెంటనే అంబులెన్స్ ను రప్పిస్తే గుండె ఆగిపోయినా తిరిగి పనిచేసేలా చూస్తారు. ఛాతీ నొప్పితో వచ్చినవారిని వెంటనే ఆసుపత్రిలో చేర్చుకుంటారు కూడా.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version