లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ లో ఉంది కాంగ్రెస్
ముందున్న లైఫ్ అంతా మాదే అంటుంది టీఆర్ఎస్
ఈక్రమంలోనే ఒకరిపై ఒకరు చేయి చేసుకుంటున్నారు
ఒకరినొకరు తిట్టుకుంటున్నారు
వీటివల్ల వచ్చే మంచి వచ్చే చెడు
రెండింటికీ రెండు పార్టీలకు తప్పక బాధ్యత ఉంది.
కాంగ్రెస్ పార్టీ ప్రాబ్లం ఏంటి? టీఆర్ఎస్ ఎమ్మెల్యే పై దాడి ఏంటి? ప్రజా సమస్యల కోసమే వీరంతా పరితపిస్తున్నారా లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆరాటపడుతూ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నారా? ఒక్కటి మాత్రం నిజం దాడుల సంస్కృతిపై వాటికి కారణం అయిన సంఘటనలపై పూర్తి అవగాహనతో రేవంత్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. లేదా కాంగ్రెస్ విద్యార్థి విభాగం ప్రతినిధులు అయిన వాళ్లకున్న సమస్యలేంటో వివరించగలగాలి.
నిజంగానే ఇబ్రహీపట్నంలో ప్రజా సమస్యల కోసమే కాంగ్రెస్ పోరాడాలనుకుంటే అందుకు ఈ విధానం సరైంది కాదు. ఆ విధంగా కాకుండా వ్యక్తిగత కక్షల కారణంగా ఎమ్మెల్యేను టార్గెట్ చేయాలనుకుంటే తరువాత వచ్చే పర్యావసనాలకు కూడా ఎన్ఎస్‌యూఐ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇవేవీ కాకుండా ఇంకేమయినా కారణాలున్నాయా అంటే అవి కూడా వెతికి తీరాలి. భూ కబ్జాలపైనో లేదా అవినీతిపైనో మాట్లాడాల్సిన విపక్షం ఆ పని చేయాలి కానీ చేయడం లేదు అని కూడా తెలుస్తోంది. అధికార పక్షం తప్పులను చెప్పకుండా ఇలా కోడి గుడ్లతో దాడులు చేయడం వల్ల వీళ్లు సాధించేదేమీ ఉండదు అన్నది మాత్రం సుస్పష్టం.
ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి జిల్లా,తెలంగాణ)లో నిన్నటివేళ ఓ సంఘటన జరిగింది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి చేశారు కాంగ్రెస్ విద్యార్థి విభాగ ప్రతినిధులు. అలాచేయడం తప్పాఒప్పా అన్నది అటుంచితే ఎందుకని ఇటువంటి ఘటనల తరువాత కూడా పార్టీ అధినేతలు స్పందించరు. ప్రశ్నించడం హక్కు కాదనం కానీ దాడి చేయడం మాత్రం హక్కు అని ఎలా అనుకుంటున్నారు. ఏ విధంగా దాడిని ఓ ప్రజాస్వామిక చర్యగా చూడాలనుకుంటున్నారు. మాట్లాడాల్సిన ఎమ్మెల్యే కానీ మాట్లాడాల్సిన కేసీఆర్ కానీ ఎందుకని మాట్లాడడం లేదు. అదే పెద్ద చిక్కుగా ఉంది. చిక్కు ప్రశ్నను పోలి ఉంది.
పోలికలు, పోలికేకలు ఎలా ఉన్నా కాంగ్రెస్ విద్యార్థి విభాగం ప్రతినిధులు ఆ విధంగా దాడి చేయాలనుకోవడం అన్నది పార్టీ ఏమయినా ఇచ్చిన రూలింగా? కాదు కదా! ఇదే సందర్భంలో దాడి చేసిన వాళ్లను పట్టుకుని స్టేషన్ కు కూడా తరలించారని కూడా తెలుస్తోంది. అంతేకాదు ఎమ్మెల్యే మనుషులు కూడా ఎక్కడా తగ్గలేదు అని దాడికి పాల్పడిన కుర్రాళ్లకు దేహశుద్ధి చేశారని కూడా అంటున్నారు కొందరు.గతంలో కూడా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంను ముట్టడించిన సందర్భంలో కూడా ఇలానే దాడులు, ప్రతిదాడులు జరిగాయి అని ప్రధాన మీడియా చెబుతోంది.ఇక ఈ సమస్యకు పరిష్కారం ఎవరు సూచిస్తారో?
– డిస్కషన్ పాయింట్ – మనలోకం ప్రత్యేకం