ఎడిట్ నోట్: కేసీఆర్ హస్తిన రాజకీయం..!

-

ఓ వైపు రాష్ట్రంలో తనదైన శైలిలో వ్యూహాలు వేస్తూ..మూడోసారి కూడా గెలిచి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్..మరోవైపు కేంద్రంలో చక్రం తిప్పాలని జాతీయ రాజకీయాల్లో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీని విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహారాష్ట్ర పై కే‌సి‌ఆర్ ఎక్కువ ఫోకస్ చేశారు. అలాగే కేంద్రంలో మోదీ సర్కార్‌ని గద్దె దించాలని చెప్పి కే‌సి‌ఆర్ రాజకీయం చేస్తున్నారు.

ఇప్పటికే విపక్ష పార్టీలని ఏకం చేసి..బి‌జే‌పికి చెక్ పెట్టాలని కే‌సి‌ఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ నుంచి చక్రం తిప్పడానికి కే‌సి‌ఆర్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో బి‌ఆర్‌ఎస్ పార్టీ ఆఫీసు నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన కే‌సి‌ఆర్..ఇప్పుడు ఆ నిర్మాణం పూర్తి అయింది.  ఈ నేప‌థ్యంలో కేసీఆర్ బీఆర్ఎస్ కేంద్ర కార్యాల‌యాన్ని ప్రారంభించ‌నున్నారు. ఇక హోమం, యాగం, వాస్తు పూజ‌ల్లో కేసీఆర్ పాల్గొన‌నున్నారు. అనంత‌రం పార్టీ కేంద్ర కార్యాల‌యాన్ని ప్రారంభించి,  బీఆర్ఎస్ కార్యాలయంలోనే పార్టీ నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ గంట పాటు సమావేశం నిర్వహించనున్నారు.

అయితే రెండు రోజుల పాటు ఢిల్లీ కేంద్రంగానే కే‌సి‌ఆర్ రాజకీయం చేయనున్నారు. ఈ క్రమంలో వివిధ విపక్ష నేతలతో భేటీ అవుతారని తెలుస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలు ఉమ్మడి పోరాటం చేయాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నా, కాంగ్రెస్ తో కలిసేందుకు సిద్దంగా లేని పార్టీల పైన రాహుల్ గాంధీతో బీహార్ సి‌ఎం నితీష్ చర్చించారు.

అందులో భాగంగానే మమతా బెనర్జీ, కేసీఆర్, కేజ్రీవాల్ తో సంప్రదింపుల బాధ్యతలను నితీష్ స్వీకరించారు. ఇక ఇప్పుడు కే‌సి‌ఆర్ ఢిల్లీకి వచ్చిన నేపథ్యంలో ఆయనతో నితిశ్ భేటీ అవుతారని తెలుస్తోంది. అయితే తెలంగాణలో బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ శతృత్వం ఉంది. బి‌ఆర్‌ఎస్ తో పొత్తు ఉండదని కాంగ్రెస్ చెబుతుంది. ఈ క్రమంలో కే‌సి‌ఆర్..కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఎలాగో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముందు జరుగుతాయి. అవి అయ్యాక పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఇక అప్పుడు కాంగ్రెస్ తో కే‌సి‌ఆర్ కలిసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. చూడాలి మరి కే‌సి‌ఆర్ నేషనల్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో.

Read more RELATED
Recommended to you

Latest news