దాదాపు 8 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. 2014 ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా మోదీతో..పవన్ కలిశారు. మళ్ళీ ఆ తర్వాత కలవడం జరగలేదు. ఇక మధ్యలో బీజేపీపై పవన్ విమర్శలు చేశారు..2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసి ఫెయిల్ అయ్యారు. ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి ముందుకెళుతున్నారు. పేరుకు పొత్తు ఉంది గాని..ఎప్పుడు బీజేపీతో కలిసి కార్యక్రమాలు చేయలేదు.
పవన్ సోలో గానే జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు..ఇటీవల కాలంలో మరింత దూకుడుగా పవన్ ముందుకెళుతున్నారు. అటు వైసీపీ సైతం పవన్‌ని గట్టిగా టార్గెట్ చేస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా విశాఖకు వచ్చిన మోదీని పవన్ కలిశారు. దాదాపు అరగంట పాటు వారి సమావేశం జరిగింది. సమావేశంలో ఏం చర్చకు వచ్చిందో ఎవరికి క్లారిటీ లేదు. కానీ సమావేశం తర్వాత బయటకొచ్చిన పవన్..పిఎంఓ నుంచి ఆహ్వానం రావడంతోనే మోదీని కలిశానని, ఏపీ పరిస్థితులపై మోదీ అడిగి తెలుసుకున్నారని, ఏపీ ప్రజలు చాలా ఆనందంగా ఉండాలని, రాష్ట్ర అభివృద్ధి జరగాలని… దానికోసం కృషి చేస్తానని ప్రధాని హామీ ఇచ్చినట్లు వివరించారు.
అయితే పైకి పవన్ చెప్పింది ఇదే..కానీ ఇంకా రాజకీయాలపై చర్చ జరిగి ఉంటుందని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా పవన్..జగన్ టార్గెట్ గా..జగన్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని వివరించి ఉంటారని తెలుస్తోంది. మొదట ఇద్దరి మధ్య కుశల ప్రశ్నలు నడిచాయని, తర్వాత మోదీ పాలనపై పవన్ ప్రశంసలు కురిపించారని, ఇక జగన్ ప్రభుత్వ తీరుని పవన్..ప్రధానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు..తనకు అన్నీ తెలుసని చెబుతూనే..రాష్ట్ర పరిస్తితుల గురించి ఇంకా అడిగి తెలుసుకున్నారని తెలిసింది.
ఆర్ధికంగా ఛిన్నాభిన్నం కావడం, ఆలయాలపై దాడులు, వ్యవస్థలని వాడుకుని కొందరి లక్ష్యంగా దాడులు చేయడం, ఇళ్ళు కూల్చడం, విశాఖలో తనని నిర్భదించిన తీరుని సైతం పవన్..ప్రధానికి వివరించారని తెలుస్తోంది. వీటి అన్నిటికి ప్రధాని..తనకు అన్నీ తెలుసని చెప్పారట. అలాగే తరుచూ కలుద్దామని చెప్పినట్లు సమాచారం. మొత్తానికి జగన్ లక్ష్యంగానే పవన్..మోదీకి ఫిర్యాదులు చేశారని తెలుస్తోంది. ఇక చంద్రబాబుతో పొత్తు గురించి, ఇతర అంశాలు చర్చకు వచ్చాయో లేవో క్లారిటీ రావడం లేదు.