ఒమన్‌లో చిక్కుకున్న నిరుపేద యువతిని కాపాడిన హర్భజన్

-

ఆపదలో ఉన్నవాళ్లని ఆదుకుంటూ తరచూ మానవత్వాన్ని చాటుకుంటూ ఉంటాడు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్. ఇటీవల గల్ఫ్ మోసగాళ్ల చెరలో చిక్కుకున్న ఓ నిరుపేద అమ్మాయిని కాపాడి మరో సారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఎంబసీ అధికారుల సాయంతో ఆమెను సురక్షితంగా భారత్‌కు చేర్చాడు.

పంజాబ్‌లోని బఠిండా జిల్లా బార్‌కండి గ్రామానికి చెందిన సికందర్‌సింగ్‌ దినకూలీ. ఈయనకున్న ముగ్గురు సంతానంలో కమల్జీత్‌ కౌర్‌ (21) పెద్దమ్మాయి. తండ్రి కష్టాన్ని పంచుకుందామని స్థానిక ఏజెంటు ద్వారా గత ఆగస్టు నెలాఖరులో ఈమె ఒమన్‌ రాజధాని మస్కట్‌ చేరింది. అక్కడ భారతీయ కుటుంబంలో పనికి కుదుర్చుతామని చెప్పారు. ఒమన్‌ ఏజెంటు అర్బన్‌ విమానాశ్రయం నుంచి నేరుగా ఫలజ్‌ అల్‌ ఖబైల్‌ అనే చోటుకు ఈమెను తీసుకువెళ్లాడు. వెళ్లగానే కమల్జీత్‌ పాస్‌పోర్టు, సిమ్‌కార్డు లాక్కొన్నారు. అక్కడ మరో 20 మంది మహిళలు ఉన్నారు. అందరూ భారతీయులే. ఈమె చేత బలవంతంగా బుర్ఖా ధరింపజేసి, అరబిక్‌ భాష నేర్చుకోవాలని హుకుం జారీ చేశారు.

తాను మోసపోయానని గ్రహించిన కమల్జీత్‌.. తర్వాత అతి కష్టం మీద కొత్త సిమ్‌కార్డు సంపాదించి తండ్రికి ఫోను చేసింది. జరిగిందంతా చెప్పి బావురుమంది. ఈ విషయం అక్కడున్న సంరక్షకులకు తెలిసిపోయి ఆమెను కర్రతో చితకబాదారు. తన కుమార్తెను ఎలాగైనా మళ్లీ వెనక్కు రప్పించాలని సికందర్‌సింగ్‌ ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి, స్థానిక ఏజెంటు చేతికి మరో రూ.2.5 లక్షలు అందించాడు.

రాజ్యసభ సభ్యుడిగా ఉన్న హర్భజన్‌సింగ్‌కు స్థానిక ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతల ద్వారా ఈ విషయం తెలియడంతో ఆయన మానవతా హృదయంతో స్పందించారు. ఒమన్‌లోని భారత ఎంబసీ అధికారులతో మాట్లాడి, సహాయం చేయవలసిందిగా కోరారు. ఎంబసీ అధికారుల చొరవతో సెప్టెంబరు 3న మస్కట్‌లో భారత విమానమెక్కి కమల్జీత్‌ ఇంటికి చేరింది. తనలా అక్కడ చిక్కిన మిగతా భారతీయ యువతుల విడుదలకు కూడా ప్రభుత్వం చొరవ చూపాలని ఆమె కోరుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version