హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతని మంత్రి హరీష్ రావు ( Harish Rao ), తన భుజాన పెట్టుకున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అక్కడే మకాం వేసి, టీఆర్ఎస్ గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ని ప్రకటించిన దగ్గర నుంచి హరీష్, హుజూరాబాద్‌లోనే ఉంటూ, కారు గుర్తుకు ఓటు వేయాలని తిరుగుతున్నారు.
harish rao | హరీష్ రావు
అయితే ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్ధి పెద్దగా హైలైట్ కాకుండా, కేవలం కారు మాత్రమే కనిపించేలా ప్రచారం చేసుకుంటున్నారు. అటు ప్రభుత్వం తరుపున జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటు రాజకీయంగా ఈటల రాజేందర్ ని దెబ్బ తీయడానికి హరీష్ అదిరిపోయే వ్యూహాలతో ముందుకెళుతున్నారు. ఈటలకు అండగా ఉంటున్న నాయకులని తనవైపుకు తిప్పుకుంటున్నారు. అలాగే ఈటల అనుచరులని వరుసపెట్టి టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారు.
ఇక అన్నిటికంటే ముఖ్యంగా హరీష్… హుజూరాబాద్ వార్‌నే మార్చేస్తున్నారు. అసలు హుజూరాబాద్‌లో కేసీఆర్ వర్సెస్ ఈటల అన్నట్లుగా ఫైట్ జరుగుతుంది. అక్కడ ప్రజలు కూడా అలాగే పోరుని చూస్తున్నారు. ఇలా పోరు జరగడం వల్ల… ప్రజలు ఎక్కువగా ఈటలపై సానుభూతితో ఉన్నారు. దాని వల్ల హుజూరాబాద్‌లో ఈటలకే ప్రజల మద్ధతు ఎక్కువ కనిపిస్తోంది. దీంతో హరీష్ వ్యూహాత్మకంగా ఈటలని సైడ్ చేసి పోరులోకి బీజేపీని తీసుకొస్తున్నారు. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా పోరు మారుస్తున్నారు.
ఇలా చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైఫల్యాలని హరీష్ ఎండగట్టవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీని వల్ల బీజేపీ తమ రాష్ట్రానికి ఏం చేయలేదని చెబితే, అప్పుడు ప్రజలు కూడా బీజేపీపై వ్యతిరేకత పెంచుకుంటారు. ఇక బీజేపీ తరుపున పోటీ చేస్తున్న ఈటలకు కూడా ఇబ్బంది అవుతుంది. అందుకే హరీష్, బీజేపీనే హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ హరీష్ ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. హుజూరాబాద్ ప్రజలు ఈటలనే చూస్తున్నారని అర్ధమవుతుంది.