ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్లాలంటే..పర్సు నిండా డబ్బులు పెట్టుకోని.. అది ఎవరూ కొట్టేకుండా కాపాడుకుంటూ ఉండేవాళ్లం.. కానీ బయటకు వెళ్తుంటే పర్సు తీసుకెళ్లడమే చాలామంది మానేశారు.. ఏంకొన్నా..యూపీఐ పేమెంట్స్ చేయడమే.. జనాలంతా వీటికే బాగా అలవాటు పడ్డారని.. దుకాణదారులు కూడా అప్డెడ్ అయ్యారు. దుకాణంలో యూపీఐ పేమెంట్స్ అంగీకరించకపోతే.. కష్టమర్స్ రారు.. వ్యాపారం పడిపోతుంది. అయితే తాజాగా వచ్చిన గణాంకాలను చూస్తే..యూపీఐ ముసుగులో భారీ స్కామ్‌లు జరుగుతున్నాయని తేలింది.. అప్రమత్తంగా లేకపోతే.. అంతే సంగతులు.!
కేంద్ర హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో (NCRP) సైబర్ మోసాలకు సంబంధించిన కంప్లైంట్స్ భారీగా పెరుగుతున్నాయని పేర్కొంది.. 2022 మొదటి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో సైబర్ మోసాలు 15.3 శాతం పెరిగాయి.
గుబులు పెట్టిస్తున్న గణాంకాలు..!
నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లోని డేటా ప్రకారం మొదటి త్రైమాసికంలో 206198 ఫిర్యాదులు నమోదు కాగా, రెండో త్రైమాసికంలో 15.3 శాతం పెరిగి 237659 కంప్లైంట్స్ రిపోర్ట్ అయ్యాయి. కేటగిరీ వారీగా చూస్తే 2022 మొదటి త్రైమాసికంలో 62,350 యూపీఐ మోసాలు నమోదైతే, రెండో త్రైమాసికంలో 84,145 యూపీఐ మోసాలు నమోదయ్యాయి. ఏకంగా యూపీఐ మోసాల్లో 34 శాతం పెరిగినట్టు లెక్కల్లో తేలింది.. యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయడం పెరగడమే ఈ మోసాలు పెరగడానికి కారణంగా గాణాంకాలు చెబుతున్నాయి.. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం.. సెప్టెంబర్ చివరి నాటికి యూపీఐ పేమెంట్స్ 1200 శాతం పెరిగాయి. కేంద్ర హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రిపోర్ట్ ప్రకారం.. మొత్తం సైబర్ నేరాళ్లో ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు 67.9 శాతం ఉన్నాయి.
డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, సిమ్ స్విచ్ ఫ్రాడ్ లాంటి వాటి ద్వారా ఆర్థిక మోసాలు విపరీతంగా జరుగుతున్నాయి. 2022 మొదటి త్రైమాసికంలో ఇలాంటి 24,270 మోసాలు జరిగాయి. రెండో త్రైమాసికంలో ఈ మోసాలు 26,793కి పెరిగాయి. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కంప్లైంట్స్ తగ్గడం ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం.. 2022 మొదటి త్రైమాసికంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ మోసాలకు సంబంధించి 20,443 కంప్లైంట్స్ నమోదైతే, రెండో త్రైమాసికంలో 19,267 ఫిర్యాదులు నమోదయ్యాయి..
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, వాట్సప్ లాంటి సంస్థలు యూపీఐ సేవల్ని అందిస్తున్నాయి. మీరూ తరచూ యూపీఐ పేమెంట్స్ చేస్తున్నట్టైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి..యూపీఐ మోసాల్లో ఎక్కువగా పిన్ మోసాలు జరుగుతుంటాయి. మీరు ఎవరికైనా డబ్బులు పంపాలన్నా, పేమెంట్స్ చేయాలన్నా పిన్ ఎంటర్ చేయాలి… కానీ డబ్బులు స్వీకరించడానికి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదని బాగా గుర్తించుకోండి.. ఈ విషయం తెలియకే చాలామంది మోసపోతున్నారు..ఎవరైనా యూపీఐ పిన్ అడుగుతున్నారంటే మోసం చేస్తున్నారని అర్థం.. ఇది గట్టిగా గుర్తుంచుకోండి.. నెలకోసారైనా మీ యూపీఐ పిన్ మారుస్తూ ఉండాలి. యూపీఐ పేమెంట్స్ చేసేప్పుడు మీరు ఎవరికి డబ్బులు పంపిస్తున్నారో పేరు కరెక్ట్‌గా చెక్ చేసుకోండి…అవసరం అయితే ఒక రూపాయి ముందుగా ట్రాన్స్‌ఫర్ చేసి, కరెక్ట్‌గా డబ్బులు పంపారో లేదో వెరిఫై చేసి మిగతా మొత్తం ట్రాన్స్‌ఫర్ చేయాలి.. ఇప్పటికీ చాలామంది ఇలా రూపాయి పంపే పద్ధతిని పాటిస్తున్నారు.. ఈ పద్ధతి అందరూ చేస్తే మోసాలు తగ్గే అవకాశం ఉంది.