హుజూరాబాద్ ఉప ఎన్నిక…ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్. ఈ ఉపఎన్నిక ఎవరు కోరుకున్నది కాదు. ఊహించని రీతిలో ఈటల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణలు రావడం, దానిపై కేసీఆర్ విచారణకు ఆదేశించడం, ఈటలని మంత్రివర్గం నుంచి తప్పించడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఇక ఈటల కూడా టీఆర్ఎస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఉపఎన్నిక అనివార్యమైంది.
ఈ ఉపఎన్నికలో తన సత్తా ఏంటో కేసీఆర్‌కు చూపించాలని ఈటల చూస్తున్నారు. అలాగే ఈటలకు చెక్ పెట్టి హుజూరాబాద్‌లో గులాబీ జెండా ఎగరవేయాలని కేసీఆర్ చూస్తున్నారు. అందుకోసం చరిత్రలో ఎప్పుడూలేని విధంగా ఒక ఉపఎన్నిక కోసం కేసీఆర్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు పెడుతుంది. పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గానికి వేల కోట్లు కేటాయిస్తున్నారు. ఉదాహరణకు దళితబంధు, రైతు రుణమాఫీ. సరికొత్తగా దళితులని ఆకట్టుకోవడం కోసం కేసీఆర్, ప్రతి దళిత కుటుంబానికి పది లక్షలు ఇస్తున్నారు. అది హుజూరాబాద్‌లోని మొత్తం దళిత కుటుంబాలకు ఈ పథకం అమలు చేస్తున్నారు. అలాగే మొన్నటివరకు రైతు రుణమాఫీ గురించి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇవేగాక చాలా పెద్ద ఎత్తున హుజూరాబాద్ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇలా డబ్బులు పంచి హుజూరాబాద్ ప్రజలని ఆకట్టుకోవాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ కేసీఆర్ రాజకీయానికి ఈటల కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. తాను రాజీనామా చేయకపోతే రేషన్‌కార్డులు, పింఛన్లు, గోర్లు, దళితబంధు పథకాలు వచ్చేవి కావని, దళితబంధు కింద రూ.10 లక్షలు ఇచ్చినా, ఓటుకు రూ.లక్ష ఇచ్చినా హుజురాబాద్‌లోని అన్ని వర్గాల ప్రజలు తనవెంటే ఉంటారని ఈటల గట్టిగా చెబుతున్నారు. అయితే ఈటల రాజీనామా చేయడం వల్లే ఇలా కేసీఆర్ ప్రభుత్వం పథకాలు అందిస్తుందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు అదే అంశం ఈటలకు ప్లస్ అవుతుంది.