ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమైన టర్కీ, సిరియా దేశాల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇప్పటి వరకు 17వేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. ఎటు చూసినా శిథిలాల గుట్టలు.. శవాల దిబ్బలే కన్పిస్తున్నాయి. నిమిష నిమిషానికి బయటపడుతున్న వందలాది మృతదేహాలు హృదయాలను మెలిపెడుతున్నాయి.
టర్కీలో ఇప్పటివరకు 14,014 మంది ప్రకృతి ప్రకోపానికి బలైనట్లు దేశాధ్యక్షుడు ఎర్డోగాన్ తెలిపారు. గురువారం ఆయన గాంజియాతెప్ ప్రాంతంలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఇక, పొరుగున ఉన్న సిరియాలో మరో 3,162 మంది మృతిచెందారు. దీంతో ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 17,176కు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.
గత సోమవారం 7.8తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత నుంచి అనేక సార్లు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. టర్కీలో ఇప్పటివరకు 1117 సార్లు భూమి కంపించినట్లు తుర్కియే విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. వరుస ప్రకంపనలతో బలహీనంగా ఉన్న భవనాలు కూలిపోతున్నాయి. దీంతో ప్రమాద తీవ్రత పెరగడంతో పాటు సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు.