కాంగ్రెస్‌కు బిగ్ షాక్..ఎర్రబెల్లితో ఎమ్మెల్యే వీరయ్య..కారెక్కనున్నారా!

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి చాలా ఘోరంగా ఉంది..ఇప్పటికే ఆ పార్టీ నుంచి చాలామంది నేతలు పార్టీ మారిపోయారు. ఇక ఉన్నవారు అంతర్గత విభేదాలతో కొట్టుకుంటున్నారు. దీంతో రోజుకు రోజుకూ కాంగ్రెస్ పార్టీ పరిస్తితి దిగజారిపోతుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగలనుందని తెలుస్తోంది. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కారు ఎక్కడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది.

అసలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని వరుసపెట్టి కేసీఆర్ లాక్కున్న విషయం తెలిసిందే. 12 మంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఆ మధ్య కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం బీజేపీలో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, సీతక్క, భట్టి విక్రమార్క, పొదెం వీరయ్య ఉన్నారు. ఇందులో వీరయ్యని బీఆర్ఎస్ పార్టీ ఎప్పటినుంచో ట్రాప్ చేస్తుంది. కానీ వీరయ్య మాత్రం ఎట్టి పరిస్తితుల్లోనూ కాంగ్రెస్ పార్టీని వదిలేదని అంటున్నారు.

 

తాజాగా ఆయన..మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ని కలిశారు. హనుమకొండ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో మంత్రితో వీరయ్య మంతనాలు నిర్వహించారు. అయితే భద్రాచలంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణ గురించి మాత్రమే మంత్రితో చర్చించానని ఎమ్మెల్యే వీరయ్య చెబుతున్నారు. కానీ దీని వెనుక రాజకీయ కారణం ఉందని తెలుస్తోంది. వీరయ్యకు ములుగు స్థానంపై పట్టున్న విషయం తెలిసిందే. గతంలో కాంగ్రెస్ నుంచి ఇక్కడ రెండుసార్లు గెలిచారు.

కాకపోతే సీతక్క టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి రావడంతో 2018 ఎన్నికల్లో సీతక్క ములుగులో, వీరయ్య భద్రాచలంలో పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు భద్రాచలంతో పాటు ములుగులో గెలవడానికి వీరయ్యని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మొన్నటివరకు వీరయ్య కాంగ్రెస్ పార్టీని వీడనన్నారు. కానీ ఇప్పుడు ఎర్రబెల్లితో భేటీ అయ్యారు. మరి వీరయ్య కాంగ్రెస్‌కు సడన్ షాక్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news