ఏపీలో మహా నగరాలు లేవు: సీఎం జగన్

-

అమరావతి: ఏపీలో మహా నగరాలు లేవని సీఎం జగన్ అన్నారు. 2021–22 వార్షిక రుణ ప్రణాళికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాంటి నగరాలకు అత్యుత్తమ వైద్యం కోసం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకనే విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి టీచింగ్‌ ఆస్పత్రుల వరకూ ఆస్పత్రులను అభివృద్ధి చేపట్టామన్నారు. 16 కొత్త మెడికల్‌కాలేజీలను తీసుకు వస్తున్నామని చెప్పారు.

నాణ్యమైన ధృవీకరించిన విత్తనాల దగ్గరనుంచి, పండించిన పంటను అమ్మేంతవరకూ రైతుకు చేదోడు, వాదోడుగా ఈ ఆర్బీకేలు నిలుస్తాయని జగన్ పేర్కొన్నారు. ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయరంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. గోడోన్లు, కోల్డ్‌ స్టోరేజీలు సహా అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పార్లమెంటు నియోజకవర్గం స్థాయిలో సెకండరీ ఫుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

చేయూత, ఆసరాల లబ్ధిదారులైన మహిళలకు స్థిరంగా నాలుగేళ్లపాటు వారి చేతిలో డబ్బు పెడుతున్నామని జగన్ తెలిపారు. అమ్మ ఒడి కింద కూడా వారికి ఏడాదికి డబ్బు ఇస్తున్నామని చెప్పారు. 17వేలకుపైగా కొత్త కాలనీలను నిర్మిస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా అనూహ్య పరిస్థితులు తలెత్తాయన్నారు. వైరస్‌ ఉద్ధృతిని అడ్డుకోవడానికి కర్ఫ్యూ లాంటి నియంత్రణలు విధించామని, ఆర్థిక వృద్ధిని సాధించడంలో బ్యాంకుల పాత్ర మరువలేనిదని జగన్ స్పష్టంచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news