వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా ఉత్తరాంధ్రలో ఇప్పటి మాదిరిగానే సీట్లు తెచ్చుకోవాలని యువ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఓ విధంగా ఆయన ఇదే పంతంతో ఉన్నారు. 34 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఈ ప్రాంతంలో తన పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదే సమయంలో టీడీపీ కూడా అంతే పట్టుదలతో ఈ ప్రాంతంలో పనిచేస్తోంది. గత ఎన్నికలు నేర్పిన గుణపాఠాల నేపథ్యంలో టీడీపీ ఇప్పటి నుంచే అప్రమత్తం అవుతోంది. ఎలా అయినా ఇక్కడ ఆశించిన స్థాయిలో సత్తా చూపించాలని భావిస్తోంది. అందుకే టీడీపీ అధి నాయకత్వం ఎప్పటికప్పుడు ఏదో ఒక కార్యక్రమం ఈ ప్రాంతంలో ఏర్పాటుచేస్తూ కార్యకర్తల్లో మరియు ఇతర శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. ఎలా అయినా అనుకున్నది సాధించి అధికారం తిరిగి కైవసం చేసుకోవాలని యోచిస్తోంది.
అందుకే బాదుడే బాదుడే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఇటుగా వచ్చి స్పీకర్ నియోజకవర్గం (ఆమదాలవలస)లో నిరసన తెలిపివెళ్లారు. అటుపై ఆయన నిర్వహించిన రోడ్ షోకు విపరీతం అయిన స్పందన వచ్చింది. అనూహ్య స్పందన నేపథ్యంలో బాబు కూడా మునపటి ఉత్సాహాన్ని మళ్లీ పొందారు. తరువాత ఆయన మరో సందర్భం ఒకటి వెతుక్కుని మరీ ! ఇటుగా వచ్చారు. చోడవరంలో మినీ మహానాడు తో పాటు ఉత్తరాంధ్రలో కొన్ని కీలక కార్యక్రమాలకు శ్రీ కారం దిద్దారు. చోడవరం మినీమహానాడు అనుకున్న దాని కన్నా పెద్ద హిట్ అయింది. ఆ విధంగా ఆయన మళ్లీ మళ్లీ జనసంద్రాన్ని చూశారు. అటుపై అనకాపల్లిలో పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించి, నియోజకవర్గ ఇంఛార్జులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
అనకాపల్లిలో తెలుగు తమ్ముళ్లు నిర్వహించిన ర్యాలీలో చంద్రబాబు మాట్లాడారు. ఇక్కడ కూడా ఆయనకు జనం బ్రహ్మరథం పట్టారు. అటుపై ఆయన విజయనగరం జిల్లా, చీపురుపల్లికి చేరుకున్నారు. ఇక్కడ రోడ్ షో నిర్వహించారు. ఇక్కడ కూడా జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ మూడు కార్యక్రమాలకూ జనం నుంచి విశేష స్పందన రావడంతో జగన్ అప్రమత్తం అయ్యారని అంటున్నారు పరిశీలకులు. తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయమై ఇప్పటి నుంచే చర్చోపచర్చలు జరిపి ప్లీనరీలో ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి.