చంద్రబాబు ఓ వ్యూహం వేస్తే దానికి అందకుండా ప్రతి వ్యూహం వేసి రాజకీయం చేయడం జగన్కు వెన్నతో పెట్టిన విద్యాగా మారిపోయింది. అపర చాణక్యుడు అని పేరు తెచ్చుకున్న బాబుకే జగన్ చుక్కలు చూపిస్తున్నారు. ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా పదునైన వ్యూహాలతో జగన్ పనిచేస్తున్నారు. చంద్రబాబు అనూహ్యంగా ఏదైనా వ్యూహంతో వస్తే తనకు కౌంటరుగా జగన్ అదిరిపోయే వ్యూహాలతో వస్తున్నారు.
మళ్ళీ గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా జగన్ సత్తా చాటుతున్నారు. ఈ మధ్య చంద్రబాబు బాదుడేబాదుడుతో పాటు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అంటే జగన్ ప్రభుత్వం వల్ల రాష్ట్రం నాశనం అయిందని, ప్రజలపై పెను భారం పడిందని, ఆ అంశాలని ప్రజలకు వివరించాలని టీడీపీ నేతలని ఇంటింటికి పంపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దూసుకెళుతున్నారు. అయితే ఇలా టీడీపీ దూసుకెళుతున్న సమయంలో జగన్ ఎలాంటి వ్యూహంతో వస్తారనేది ఎవరికి క్లారిటీ లేదు.
ఇప్పటికే గడపగడప కార్యక్రమంలో పాల్గొంటున్నారు..కానీ అది ఏ మాత్రం చాలదని అర్ధమైంది. కేవలం ఎమ్మెల్యేలే కాదు..వారి పనితీరుని నిరంతరం పరిశీలించే…పరిశీలకులు కూడా ఉండాలని చెప్పి..అనూహ్యంగా 175 స్థానాల్లో పరిశీలకులని నియమించారు. వీరిని ప్రాంతీయ సమన్వయకర్తలు సమన్వయం చేస్తారు. అదే సమయంలో వాలంటీర్ వ్యవస్థకు సమానంగా ప్రతి 50 ఇళ్లకు ఓ వైసీపీ కార్యకర్తని పరిశీలకుడుగా పెడుతున్నారు. వారు 50 ఇళ్ళలో పథకాలు ఎలా వస్తున్నాయి..వారిని వైసీపీకే మద్ధతు ఉండేలా ఎలా చేయాలనే అంశాలని చూసుకుంటారు.
ఇలా జగన్ వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకొచ్చారు. ఇక అసెంబ్లీ ఎన్నికలు 18 నెలల్లోనే రాబోతున్నాయని, యుద్ధానికి సిద్ధంగా ఉండాలని వైసీపీ నేతలకు జగన్ పిలుపిచ్చారు. ప్రస్తుతం ఉన్న 151 అసెంబ్లీ స్థానాల కంటే ఇంకా ఎక్కవగా.. మొత్తం 175 సీట్లనూ దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అంటే 175 సీట్లు టార్గెట్గా పెట్టుకుని అదిరిపోయే వ్యూహాలతో పనిచేస్తున్నారు.