రెండు దశల కరోనా తరువాత ఆంధ్రావని ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సమస్యలూ సంబంధిత ఒడిదొడుకులూ దాటి మాట్లాడేందుకు నాయక గణం కూడా ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో కరోనా కారణంగా అనాథలయిన చిన్నారులకు ఏపీ ప్రభుత్వం అండగా ఉండాల్సిన తరుణం ఇదే..! ఇందుకోసం కేంద్రం కూడా కొంత సాయం చేసింది. కేంద్రం ఇచ్చిన 1200 కోట్ల రూపాయలు కూడా కరోనా బారిన పడి అనాథలయినా లేదా ఆర్థిక ఆసరా లేకుండా ఒంటరి అయిన కుటుంబాలను ఆదుకునేందుకే ! అయితే కేంద్రం తరఫున వచ్చిన నిధులు కూడా పక్కదోవ పట్టించి వేర్వేరు కారణాలతో ఖర్చు చేశారని వార్తలు కూడా వచ్చాయి. సుప్రీం కూడా ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి ఓ చివరి అవకాశం ఇచ్చింది.
ఈ నేపథ్యంలో జగన్ పై జనసేన మండి పడుతోంది. ఆ పార్టీ అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ ఏమంటున్నారంటే.. కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలు ఐన పిల్లలకు ఒక్కొక్కరికి పదిలక్షల రూపాయల చొప్పున డిపాజిట్ చేస్తామని ఏపీ ప్రభుత్వం గత ఏడాది ప్రకటించింది. ఇప్పటివరకు ఎంతమంది పిల్లలను ఆదుకున్నారంటారు??? మరిచిపోయారా అని ఆవేదనా పూరిత స్వరంతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా కరోనా కారణంగా అనాథలయిన కుటుంబాలను మానవతా దృక్పథంతో ఈ పాటికే ఆదుకోవాల్సి ఉంది. అదేవిధంగా నెలకు రెండు వేల రూపాయలు చొప్పున జీవన భృతికి కాస్తో కూస్తో ఇవ్వాల్సి ఉంది. అంతేకాకుండా స్థానిక నాయకత్వాలు కూడా స్పందించి సంబంధిత కుటుంబాలకు ఎంతో కొంత ఆసరా ఇచ్చినా కూడా అది సరిపోవడం లేదు. ఈ నేపథ్యాన జగన్ కాస్త కనికరిస్తే కరోనా కారణంగా రోడ్డున పడ్డ కుటుంబాలు కాస్తో కూస్తో కుదుట పడతాయి.
సర్వే చేయించండి
వాస్తవానికి కొన్ని చోట్ల సాధారణ మరణాలను కరోనా మరణాల ఖాతాలో జోడించారు అని వార్తలు వచ్చాయి. వాటిపై కూడా దృష్టి నిలపాలి. స్వచ్ఛతకు మారుపేరుగా నిలిచే విధంగా పాలన సాగాలి కదా ! కనుక మరోసారి సర్వే చేయించి వివరాలు సేకరిస్తే కొన్ని ఫలితాలు బాధిత వర్గాలకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా డెత్ డిక్లరేషన్-లో కూడా కొన్ని తప్పిదాలు జరిగాయి. వాస్తవానికి కరోనా కారణంగా మరణిస్తే పోస్టు మార్టం లేదు. అంటే పీఎం రిపోర్టు లేదు. కనుక వ్యాధి నిర్థారణ పరీక్షలే ఆధారం. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్పందించడం ప్రారంభిస్తే మళ్లీ మళ్లీ ఇదే విషయం చర్చకు రాకుండా ఉంటుంది..అదే విధంగా బాధిత వర్గాలకు ఆసరా లభిస్తుంది అన్నది జనసేనతో సహా ఇతర ప్రజా పక్షాల వాదన. వింటున్నారా జగన్ !