లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సామాన్యులకే కాకుండా మంత్రులకు, మాజీ మంత్రులకు కూడా రికవరీ ఏజెంట్లనుంచి బెదిరింపులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోన్ యాప్స్ ఆగడాలపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు విజయవాడ సిపి క్రాంతి రానా టాటా. లోన్ యాప్స్ చాలా ప్రమాదకరమని అన్నారు విజయవాడ సీపీ. వారు ఆఫర్ చేసే లోన్ చాలా తక్కువ మొత్తంలో ఉంటుందని.. కానీ మన పూర్తి పర్సనల్ సమాచారం లోన్ యాప్ వాళ్లకు వెళ్లిపోతుందని తెలిపారు. వాళ్లు అధిక మొత్తంలో వడ్డీ తీసుకుంటారని అన్నారు.
లోన్ యాప్ ల వల్ల హెరాస్మెంట్ కి గురైన వారు ఈ మధ్య ఎక్కువయ్యారని తెలిపారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి అశ్లీలంగా తయారు చేసి పంపుతున్నారని, ఈ లోన్ యాప్ లకు ఆర్బిఐ, ప్రభుత్వం అనుమతులు లేవని తెలిపారు. ఈ లోన్ యాప్ లపై కమిషనరేట్ పరిధిలో రెండు కేసులు నమోదయ్యాయని, యాప్ లు తయారు చేసిన వాళ్లు వేరే దేశాల్లో ఉంటున్నారని అన్నారు. నందిగామ కేసులో రికవరీ కంపెనీలను, ఏజెంట్లను అరెస్టు చేశామని తెలిపారు సిపి.