కేంద్ర మంత్రి షెకావత్ నిన్న బాధ్యతరాహిత్యంగా రాజకీయాల కోసం విలువలను తుంగలో తొక్కుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మాట్లాడారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. గురువారం టీఆర్ఎస్ఎల్పీలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మాట్లాడుతున్న కేంద్ర మంత్రులపై మంత్రి మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వ నిజస్వరూపాన్ని ఎండగడుతున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు.
దాంతో బీజేపీ నేతలకు కడుపు మండుతోందని, అంతకు ముందు మెచ్చుకున్న నోళ్లతోనే పుచ్చిపోయిన మాటలు మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాళేశ్వరానికి కితాబిచ్చిన వారే ఇప్పుడు మతలబు ఉందంటున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేంద్ర మంత్రులు షెకావత్, గడ్కరీ, సీడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ హుస్సేన్ అందరూ అభినందించారు. పార్లమెంట్ సాక్షిగా చెప్పిన నిజాలను ఇప్పుడు అబద్ధాలుగా ప్రచారం చేస్తున్నారు. వారిది నోరు అనుకోవాలా? మోరి అనుకోవాలా? అని ప్రశ్నించారు. పూటకో మాట మాట్లాడుతూ అవసరం ఉంటే ఓ తీరు.. లేకపోతే ఓ తీరు.. పదవుల కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.