మునుగోడు ఉప ఎన్నికకు ప్రచారం నేటి సాయంత్రంలో ముగియనున్న నేపథ్యంలో.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మునుగోడు ఉప ఎన్నికను ఉద్దేశించి తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు నిన్ననేమో టీఎన్జీవోల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి.. దుర్మార్గంగా అవమానించారు. ఇవాళ టీఎన్జీవో కార్యాలయంపైన కూడా దాడి చేయించే ప్రయత్నం చేశారు అంటూ విమర్శించారు మంత్రి కేటీఆర్. ఇవాళ మనుగోడు మండలం పలివెలలో దాడులకు దిగారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. గెలుస్తలేమని బోధ పడిన తర్వాత, చిల్లరగా భౌతికదాడులకు బీజేపీ దిగిందని ఆయన ఆరోపించారు.
ఆ దాడుల్లో టీఆర్ఎస్ నాయకులకు తీవ్ర గాయాలయ్యాయని, రక్తం కారేలా దాడులు చేశారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గంలో దశాబ్దాలుగా పరిష్కారం కానీ పనులను చేసి చూపించామని తెలిపారు కేటీఆర్. తాగునీటి సమస్యతో సతమతమవుతున్న మునుగోడుకు మిషన్ భగీరథతో శాశ్వత పరిష్కారం చూపించామని, ఫ్లోరోసిస్ ను నిర్మూలించామన్నారు కేటీఆర్. రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి అనాథలా మునుగోడును వదిలిపెట్టినప్పటికీ, అభివృద్ధి, సంక్షేమం ఆగలేదని, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చామని, రైతుబంధు, రైతుబీమా అమలు చేశాం. శివ్వన్నగూడెం, లక్ష్మణాపురం ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్నారు కేటీఆర్.