తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బీజేపీ నేతలపై మండిపడ్డారు. తెలంగాణలో ప్రతి అంశాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రాన్ని వివాదాస్పదంగా మార్చుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు, స్వాతంత్ర్య ఉద్యమంలో బీజేపీ ఎక్కడుంది? తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో బీజేపీ పాత్ర ఉందా? అని ప్రశ్నించారు. వజ్రోత్సవాల్లో కనీసం జాతీయ జెండాలు ఇవ్వలేకపోయారని పువ్వాడ విమర్శించారు. అంతకుముందు ఆయన ఖమ్మం జిల్లా కేంద్రంలో చేపట్టిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ర్యాలీలో పాల్గొన్నారు. జెడ్పీ సెంటర్ నుంచి బీజీఎన్నార్ కాలేజి వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పువ్వాడ ప్రసంగించారు. అంతేకాకుండా తెలంగాణ సెక్రటేరియట్‌కు జాతి నిర్మాత, మహామేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం చారిత్రాత్మక నిర్ణయమని, తెలంగాణ ప్రజలందరికీ ఇది గర్వకారణమని పువ్వాడ అజయ్ కుమార్ గారు స్పష్టం చేశారు.నూతన సచివాలయం కు అంబేద్కర్ గారి పేరు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఖమ్మం టిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తాతా మధు , మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణంతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.