రాష్ట్రంలోని గోపాలమిత్రలకు దసరాకు ముందే శుభవార్త చెప్పారు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు అందుబాటులో ఉండి.. తదితర కార్యక్రమాల్లో సేవలందిస్తున్న గోపాలమిత్రలకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తున్న పారితోషికానికి అదనంగా.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లిస్తున్న విధంగా 30 శాతం పెంచి, అదే రీతిలో గోపాలమిత్రలకు కూడా అందజేసే విధంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రకటించారు మంత్రి తలసాని. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలలో భాగస్వాములవుతూ, గ్రామీణ ప్రాంతాలలోని రైతులకు అందుబాటులో ఉంటూ పాడి గేదెలకు కృత్రిమ గర్బాధారణ, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు, నట్టల నివారణ మందుల పంపిణీ వంటి తదితర కార్యక్రమాలలో గోపాలమిత్రులు సేవలందిస్తున్న సంగతి తెలిసిందే.
గోపాలమిత్రలకు ప్రస్తుతం రూ. 8,500 చెల్లిస్తుండగా, పెరిగిన 30 శాతంతో రూ. 2,550 కలుపుకొని మొత్తం రూ. 11,050 లకు పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న 1530 మంది గోపాలమిత్రలకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు గోపాలమిత్రలకు రూ. 3,500ల పారితోషికాన్ని అందించే వారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గోపాలమిత్రలు అందిస్తున్న సేవలను కేసీఆర్ గుర్తించి, ఒకేసారి రూ. 8,500లకు పెంచడం జరిగిందని తెలిపారు. దేశంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద మొత్తంలో గోపాలమిత్రలకు పారితోషికాన్ని ఇవ్వడంలేదని స్పష్టం చేశారు.