హ‌మారా స‌ఫ‌ర్ : పెట్రో ప్రేమ‌లో మోడీ మామ !

-

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల త‌రువాత మోడీ త‌న పంథా మార్చారు. అనూహ్య ఫ‌లితాలు యూపీలో అందుకున్నాక తిరుగులేని ఆధిక్యం ప్ర‌ద‌ర్శించాక మోడీ మ‌ళ్లీ  త‌న రూటు మార్చారు. రూలు కూడా మార్చారు. ధ‌ర‌ల పెంపు విష‌య‌మై మ‌రోసారి త‌న మార్కు ప్ర‌క‌ట‌న‌ల‌కే పరిమ‌తం అవుతున్నారు. అంతే త‌ప్ప నియంత్ర‌ణ‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదు అన్న విమ‌ర్శ‌ను సైతం విప‌క్షం నుంచి అందుకుంటున్నారు.ఈ ద‌శ‌లో ధ‌ర‌లు దిగివ‌చ్చి సామాన్యుడ్ని ఆదుకునేందుకు వీల్లేని స్థితిలో ఇవాళ కేంద్ర ప్ర‌భుత్వం ఉంద‌ని నిరూపితం అయింద‌ని రేప‌టి వేళ దేశ వ్యాప్త స‌మ్మెకు క‌మ్యూనిస్టులు సిద్ధం అవుతున్నారు. ఈ ద‌శ‌లో పెట్రో ధ‌ర‌లు, డీజిల్ ధ‌ర‌లు అన్న‌వి ఆరు రోజుల వ్య‌వ‌ధిలో ఐదు సార్లు పెంచ‌డాన్ని అస్సలు స‌హించ‌లేని ప‌రిణామంగానే తాము చూస్తున్నామ‌ని, క‌రోనా త‌రువాత తిరిగి పుంజుకున్న మార్కెట్ల‌కు తాజా ధ‌ర‌ల పెంపుద‌ల ఏ మాత్రం అనుకూలంగా లేద‌ని సామాన్యులు సైతం గ‌గ్గోలు పెడుతున్నారు.

వాస్త‌వానికి పెట్రో ధ‌ర‌లన్న‌వి కేంద్రం మ‌రియు రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌రిధిలోనే ఉంటాయి. రాష్ట్రాలు త‌మ ప‌న్ను వాటా త‌గ్గించుకుని వినియోగ‌దారుల‌ను ఆదుకోవ‌చ్చు. కానీ రెండు తెలుగు రాష్ట్రాలూ ఆ ప‌ని చేసేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. మాట్లాడితే చాలు కేంద్రంపై విరుచుకుప‌డే ధోర‌ణిలో మాట్లాడే కేసీఆర్ కూడా ఈ త‌ర‌హా సానుకూల నిర్ణ‌యం (సాహ‌సోపేత నిర్ణ‌యం అయితే కాదు) తీసుకునేందుకు మొగ్గు చూప‌డం లేదు.దీంతో పెట్రో ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో స‌ర‌కు రవాణా ఛార్జీలు, కూర‌గాయ‌ల ధ‌ర‌లు ఇత‌ర  నిత్యావ‌స‌ర ధ‌ర‌లు ఇలా ఒక్క‌టేంటి అన్నీ పెరిగిపోతున్నాయి. మరోవైపు వంట నూనె ధ‌ర‌లు చుక్క‌లు చూపిస్తున్నాయి. గ్యాస్ బండ ధ‌ర వెయ్యి రూపాయ‌లు దాటిపోయింది.

ఇన్ని చేసినా కూడా అభివృద్ధి ప‌నులు మాత్రం  పెద్ద‌గా అమ‌లుకు నోచుకోవ‌డం  లేదు. పెట్రో ఉత్ప‌త్తుల‌కు సంబంధించి విధించిన ఎక్సైజ్ డ్యూటీ ద్వారా ఆదాయం ఇర‌వై ఆరు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు వ‌చ్చింద‌ని ఇంత మొత్తాన్ని ఏం చేశార‌ని కాంగ్రెస్ పార్టీ ప్ర‌శ్నిస్తోంది. వెంట‌నే వీటికి లెక్క‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తోంది. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఓ నాలుగు నెలల కాలం పాటు ధ‌ర‌ల‌ను స్థిరీక‌రించి త‌రువాత చుక్క‌లు చూపించ‌డం కేంద్రానికే సాధ్య‌మ‌ని దుయ్యబ‌ట్టింది. ఇదే స‌మ‌యంలో దేశ వ్యాప్త నిర‌స‌న‌ల‌కు సిద్ధం అవుతోంది. ఇన్ని జ‌రిగినా కేంద్రం మాత్రం అస్స‌లు త‌గ్గడం లేదు.
ధ‌ర‌ల‌కు సంబంధించి వాటి నియంత్ర‌ణ‌కు సంబంధించి చెబుతున్న మాట‌లేవీ కూడా న‌మ్మ‌శ‌క్యంగా లేవు. ఈ ద‌శ‌లో వామ‌ప‌క్షాల ఉద్య‌మాలు ఏ విధంగా ఫ‌లిస్తాయో ?

– హమారా స‌ఫ‌ర్ – మ‌న లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Latest news