రెండు తెలుగు రాష్ట్రాల్లో మోదీ టూర్ సంచలనంగా మారింది. ఓ వైపు ఏపీలో మోదీ టూర్ చుట్టూ రాజకీయం జరుగుతుంది..మరో వైపు తెలంగాణలో మోదీ టూర్‌పైనే రాజకీయం నడుస్తోంది. ఏపీలో మోదీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విశాఖలో పర్యటించనున్న ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఇక మోదీ టూర్‌ని విజయవంతం చేయడానికి బీజేపీ కంటే వైసీపీ తెగ కష్టపడుతుంది.
ఇదే సమయంలో మోదీతో పవన్ భేటీ కావడం మరో సంచలనంగా మారింది. మోదీని కలుస్తున్న పవన్..ఎలాంటి రాజకీయ మలుపు తిప్పుతారనేది ఆసక్తికరంగా మారింది. మోదీతో పవన్ భేటీ కావడం పెద్ద విశేషం ఏమి లేదని పైకి వైసీపీ చెబుతోంది గాని…లోపల మాత్రం పవన్ ఎలాంటి వ్యూహంతో ఉన్నారు..చంద్రబాబుని మోదీకి దగ్గర చేస్తారనే టెన్షన్ వైసీపీలో ఉంది. అటు మోదీ పర్యటనని నిరసిస్తూ..విశాఖ స్టీల్ ప్లాన్ ఉద్యోగులు, వామ పక్ష సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి.
ఇలా ఏపీలో మోదీ టూర్ చుట్టూ రాజకీయ నడుస్తుంటే..తెలంగాణలో మోదీ టూర్‌పై రాజకీయం జరుగుతుంది..రేపు మోదీ రామగుండంకు వచ్చి ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం మోదీతో పాటు కేసీఆర్ ఉండాలి. కానీ టిఆర్ఎస్-బిజేపిల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తున్న సమయంలో కేసీఆర్..మోదీతో పాటు రామగుండంకు రావడం లేదు. అలాగే మోదీ పర్యటనపై టిఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. అటు మోదీ పర్యటనకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి.
అయితే మోదీకి భయపడి కేసీఆర్ దాక్కుంటున్నారని బిజేపి నేతలు ఫైర్ అవుతున్నారు. జగన్‌ని చూసి కేసిఆర్ బుద్ధి తెచ్చుకోవాలని, మోదీ పర్యటనలో పాల్గొనలో లేదో అది కేసిఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నామని బిజేపి నేతలు విమర్శిస్తున్నారు. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మోదీ పర్యటన సంచలనంగా మారింది. మరి ఈ టూర్‌తో రెండు రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి.