ఎప్పుడైతే ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌ని విడిచిపెట్టారో అప్పటినుంచి తెలంగాణ రాజకీయాలు మారిపోయాయనే చెప్పొచ్చు. ఊహించని విధంగా ఈటల బయటకొచ్చాక టీఆర్ఎస్‌లో కాస్త అలజడి మొదలైన మాట వాస్తవం. టీఆర్ఎస్‌లో మొదట నుంచి పనిచేస్తున్న నాయకులు కాస్త కేసీఆర్ నాయకత్వంపై అసంతృప్తినే ఉన్నారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆ అసంతృప్తిని బయటపడకుండా చూసుకునేందుకు గట్టిగానే ప్రయత్నించారు. అందుకే ఈటలని కూడా ఓడించడానికి నానా రకాల ప్రయత్నాలు చేశారు.
కానీ అది సాధ్యం కాలేదు. ఈటల గెలిచేశారు. ఈటల గెలుపుతో టీఆర్ఎస్‌లో ఉన్న ఉద్యమ నేతలు కాస్త బయటకొచ్చే అవకాశాలు పెరిగాయి. అదే సమయంలో ఈటల సైతం ఒక పిలుపు ఇచ్చారు. టీఆర్ఎస్‌లో ఉద్యమ నేతలు బయటకొచ్చి పోరాడాలని కోరారు. దీంతో టీఆర్ఎస్‌లో అంతర్గతంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే టీఆర్ఎస్‌లో ఈటలని అభిమానించే నాయకులు చాలామంది ఉన్నారు. వారు నిదానంగా బయటపడే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.
ఈటలపై అభిమానం ఎలా ఉందో తాజాగా…డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కుమార్తె పెళ్లిలో బయటపడింది. టీఆర్ఎస్‌లో కీలకంగా ఉండే పద్మారావు గౌడ్…తన కుమార్తె పెళ్లికి ఈటలని ఆహ్వానించారు. ఈటలకు-పద్మారావుల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈటల…ఆయన కుమార్తె పెళ్లికి హాజరయ్యారు. అక్కడ టీఆర్ఎస్ నాయకులు చాలామంది వచ్చారు. ఇక వారు రాజేందర్‌తో బాగానే సన్నిహితంగానే మెలిగారు.
అంటే టీఆర్ఎస్‌ని వదిలి…ఓ యుద్ధం మాదిరిగా హుజూరాబాద్ ఉపఎన్నిక జరిగిన సరే టీఆర్ఎస్‌లో కొందరు నేతలు ఈటలని వదల్లేకపోతున్నారని తెలుస్తోంది. ఆయన అంటే ఇప్పటికే అభిమానించే నాయకులు ఉన్నారని తాజాగా జరిగిన కార్యక్రమంలో అర్ధమవుతుంది. ఇక ఈ అభిమానమే కేసీఆర్ కొంపముంచేలా ఉంది. ఏదొక రోజు టీఆర్ఎస్‌లో ఉండే ఉద్యమ నేతలు, ఈటల సన్నిహితులు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.