ప్రజా సమస్యలు, టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ అధ్యయన కమిటీ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. నిజామాబాద్ లో గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతుందని ఆరోపించారు. నిజామాబాద్ లో శాంతి భద్రతలు క్షిణించాయని, ఉగ్రవాదుల కార్యకలాపాలు ఎక్కువయ్యాయన్నారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ శాంతిబద్రతల పరిరక్షణలో వైఫల్యం చెందారని, నిజామాబాద్ లో ప్రజాప్రతినిదులను హత్య చేసేందుకు సుపారీలు తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఎంపీగా ఉన్న నాపైనా హత్యా యత్నం జరిగిందని సంచలన వ్యాఖ్‌యలు చేశారు అర్వింద్. స్వయంగా నేను ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, పోలీసుల సహకారంతోనే వందలాది నకిలీ పాస్ పోర్టులతో రోహింగ్యాలు చలామణి అవుతున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు.
జగిత్యాలకు చెందిన వ్యక్తి నిజామాబాద్ వేదికగా ఉగ్ర శిక్షణను ఇస్తున్నారని, ఈ క్యాంపులో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ నలుమూలల నుండి వచ్చి శిక్షణ తీసుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా నిజామాబాద్ సీపీ నాగరాజుకు ఎందుకు తెలియలేదని, ఎంఐఎం, టీఆర్‌ఎస్ పార్టీలు నిజామాబాద్ కమిషనర్ గా నాగరాజును తీసుకువచ్చాయని, సీపీ నాగరాజును నిజామాబాద్ కమిషనర్ స్థానం నుండి తప్పించాలన్నారు. ప్రజాసమస్యలు, టీఆర్‌ఎస్ వైఫ్యలాల అధ్యయణ కమిటీ తొలిసారి సమావేశం అయ్యిందని, తెలంగాణ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి విస్మరించిందని ఆయన విమర్శించారు.