సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని భూంపల్లి అక్బర్ పేట్ మండలంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. తహశీల్ధార్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా తహశీల్ధార్ ఆఫీస్ ఓపెనింగ్ కి వచ్చారు. ఈ సమయంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదనే బాధ ప్రజల్లో ఉందని… ఒక దరిద్రుడు ఇక్కడ ఎమ్మెల్యే కావడమే మన దురదృష్టమని మండిపడ్డారు. తన వల్లే భుంపల్లి మండలం వచ్చిందని సిగ్గు, శరం లేకుండా రఘునందన్ రావు చెప్పుకుంటున్నారని విమర్శించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏది చేసినా తానే చేసినట్టు చెప్పుకుంటున్నారని… నేషనల్ హైవేలు కూడా తానే తెచ్చినట్టు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. నేషనల్ హైవేలకు, ఎమ్మెల్యేలకు ఏమైనా సంబంధం ఉంటుందా అని ప్రశ్నించారు. అబద్ధాల యూనివర్శిటీ ఉంటే దానికి రఘునందన్ వైస్ ఛాన్సలర్ అవుతారని ఎద్దేవా చేశారు. మొన్న ఉప ఎన్నికలో ఏదో పొరపాటు జరిగి ఆయన గెలిచారని… మరోసారి అలాంటి పొరపాటు జరగకుండా మనం చూసుకోవాలని అన్నారు. ఉచిత విద్యుత్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్నందుకు కేంద్రం ఓర్వలేకపోతుందని, అందుకే నిధులు ఆపేసిందని ఆరోపించారు. ప్రతి పనిని తానే మంజూరు చేశానని రఘునందన్ రావు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు.