హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో మునవర్ ఫారూఖీ కామెడీ షో ఉద్రిక్త వాతావరణం మధ్య ముగిసింది. దాదాపు రెండున్నర గంటలపాటు ఈ ప్రదర్శన సాగింది. అయితే షోను అడ్డుకునేందుకు వచ్చిన 50 మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శిల్ప కళావేదిక వద్ద ఇంకా పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. స్టాండప్ కామెడీలో చేయి తిరిగిన మునావర్ ఫారూఖీ షోకు హైదరాబాదీలు క్యూ కట్టారు. తన స్టాండప్ కామెడీ షోల్లో హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తారంటూ మునావర్ ఫారూఖీపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌లో అతడి షోకు ముందుగా తెలంగాణ సర్కారు అనుమతి ఇవ్వలేదు.
షోకు మరో రెండు రోజుల సమయం ఉందనగా… హైదరాబాద్ పోలీసుల నుంచి అనుమతి సంపాదించిన మునావర్… ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నగరంలోని శిల్ప కళావేదికలో తన షోను నిర్వహించనున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున రచ్చ జరిగిన ఈ షోకు నగర వాసులు పోటెత్తారు. బుక్ మై షో ద్వారా టికెట్లు కొనుగోలు చేసిన హైదరాబాదీలు… షో మొదలు కావడానికి ముందే శిల్ప కళావేదిక వద్ద క్యూ కట్టారు. మునావర్ షోను అడ్డుకుంటామని బీజేపీ నేతలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శిల్ప కళావేదిక పరిసరాల్లో వేలాది మంది పోలీసులు పహారా కాస్తున్నారు. అయినప్పటికీ నగరవాసులు మునావర్ షో పట్ల అమితాసక్తి కనబరచారు.