ఆంధ్రావనిలో ప్రత్యేక జిల్లాల పోరు కొనసాగుతోంది.ముఖ్యంగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా (విజయవాడ కేంద్రంగా ఏర్పాటయ్యే కొత్త జిల్లా) పై సినీనటుడు, నందమూరి నట వారసుడు,హిందూపురం ఎమ్మెల్యే స్పందించారు.నిన్నటి వేళ హిందూపురంను జిల్లా కేంద్రంగా ఉంచుతూ సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన భారీ ఎత్తున తన అభిమాన శ్రేణులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహాలకు సరైన గౌరవం ఇవ్వకుండా, ఎన్టీఆర్ పేరిట ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను రద్దు చేసి ఆ మహనీయుని పేరును ఓ జిల్లాకు పెట్టినంత మాత్రాన సమస్య సమసిపోదని అంటూ బాలయ్య ఫైర్ అయ్యారు.
మరోవైపు హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటు పై రెండు రోజులుగా ఆయన అలుపు అన్నది ఎరుగక పోరాడుతూనే ఉన్నారు. ఇవాళ కూడా ఆయన ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మౌన దీక్ష చేపట్టి, అనంతరం భారీ ప్రదర్శనగా అనంతపురం కలెక్టరేట్ కు చేరుకుని, వినతి పత్రం ఇచ్చి వచ్చారు. దీంతో వైసీపీలో మరింత కలవరం రేగుతోంది.టీడీపీ పొలిటికల్ స్ట్రాటజీ ఏంటన్నది తేలకున్నా జిల్లాల ఏర్పాటుపై చంద్రబాబు ఆలోచన ఏ విధంగా ఉందో అన్నది స్పష్టం కాకున్నా బాలయ్య మాత్రం ప్రజాభీష్టం మేరకు తన పని తాను చేసుకుని పోతున్నారు.వీలున్నంత వరకూ ప్రజాభిష్టంకు అనుగుణంగానే తాను ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాననే అంటున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కూడా అంటున్నారు. అంతేకాదు సీఎం జగన్ ను కూడా కలుస్తానని స్పష్టం చేసి మరో సంచలనం రేపారు.