కార్యకర్తలకు పసుపు జెండా అంటే పిచ్చి అని నారా లోకేష్ అన్నారు. వాట్సాప్ ద్వారా టీడీపీ సభ్యత్వాన్ని రూపొందించుకోవాలని ప్రణాళిక సిద్దం చేశామని.. వాట్సాప్ ద్వారా సభ్యత్వాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నిందని ఫైర్ అయ్యారు. టీడీపీ సభ్యత్వం విషయమై వాట్సాప్ యాజమాన్యానికి ఈ ప్రభుత్వం నాలుగు పేజీల లేఖ రాసిందని.. సభ్యత్వానికి కావాల్సిన టెక్నాలజీ ఏంటని ప్రభుత్వం అడిగితే మేమే చెబుతాంగా..? అని ప్రశ్నించారు.
టీడీపీకి కార్యకర్తలే బలమని… టీడీపీ కార్యకర్తలకు పసుపు జెండా అంటే పిచ్చి అని తెలిపారు. కార్యకర్తల సంక్షేమం కోసం పని చేసే అవకాశమే నాకు చాలా సంతోషాన్నిస్తోందని.. కార్యకర్తల సంక్షేమం కోసం.. కార్యకర్తల కుటుంబాల కోసం టీడీపీ ఎప్పుడూ ముందే ఉంటోందని పేర్కొన్నారు. ఫ్యాక్షన్ బాధిత కార్యకర్తల పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించడానితే ఎన్టీఆర్ మోడల్ స్కూలును చంద్రబాబు ప్రారంభించారని… ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏర్పాటు ద్వారా చాలా మంది ఫ్యాక్షన్ బాధిత ఫ్యామ్లీలకు చెందిన పిల్లలు ఫ్యాక్షన్ ఉచ్చులో చిక్కుకోకుండా కాపాడామని తెలిపారు.
అర్థరాత్రి పూట ఏ గ్రామంలో కార్యకర్త ఇంటికి పోలీసులెళ్లి వేధించే ప్రయత్నం చేస్తే.. అండగా నిలిచే వ్యవస్థ ఏర్పాటు చేశామని.. కార్యకర్తల ఆరోగ్యానికి టీడీపీ పెద్ద పీట వేస్తోందని పేర్కొన్నారు. కార్యకర్తలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రత్యేక వ్యవస్థను తెస్తున్నామని.. కార్యకర్తలపై పోలీసుల వేధింపులను అరికట్టేలా.. పోరాడేలా లైవ్ ట్రాకింగ్ యాప్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు.