పార్లమెంట్ సెక్యూరిటీ బాధ్యతల నుంచి CRPF ఔట్.. 3317 మంది CISF సిబ్బందితో భద్రత

-

పార్లమెంటుకు ఇప్పటివరకు సీఆర్పీఎఫ్‌కు చెందిన పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ (పీడీజీ)లోని 1400 మందికిపైగా సిబ్బంది భద్రత కల్పించేవారు. ఇప్పుడు ఈ గ్రూప్ ఈ బాధ్యతల నుంచి తప్పుకుంది. ఇకపై ఈ విధులను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) నిర్వర్తించనుంది. ఈరోజు (మే 20వ తేదీ 2024) ఉదయం 6 గంటల నుంచి సీఐఎస్ఎఫ్‌కు చెందిన దాదాపు 3,317 మందికిపైగా సిబ్బంది మొత్తం పార్లమెంటు కాంప్లెక్సుకు పహారా కాస్తున్నారు.

గత శుక్రవారం రోజున పార్లమెంటు కాంప్లెక్సులోని పరిపాలన, కార్యాచరణ విభాగాలను సీఐఎస్ఎఫ్‌ ఉన్నతాధికారులకు పీడీజీ కమాండర్ అప్పగించారు.  ఆయుధాలు, వాహనాలు, కమాండోలను ఉపసంహరించుకునేందుకు పీడీజీ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. సెంట్రల్ దిల్లీలో ఉన్న పార్లమెంటు కాంప్లెక్స్‌లో పాత పార్లమెంటు భవనం, కొత్త పార్లమెంటు భవనం, వాటి అనుబంధ నిర్మాణాలు ఉన్నాయి. వాటన్నింటికి ఇకపై 3,317 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది రక్షణ కల్పించనున్నారు.

పార్లమెంటు కాంప్లెక్సులోని అన్ని ఫ్లాప్ ఎంట్రీ గేట్‌లు, పోస్టెడ్ కెనైన్ స్క్వాడ్‌లు, ఫైర్ టెండర్లు, సీసీటీవీ మానిటరింగ్ కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్ సెంటర్‌, వాచ్ టవర్‌ వంటి విభాగాల్లో ఇప్పటికే సీఐఎస్ఎఫ్ సిబ్బంది విధులను మొదలుపెట్టారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది గత 10 రోజులుగా పార్లమెంటు కాంప్లెక్స్‌ను అణువణువూ జల్లెడ పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version