భారత్‌లో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ జేఎన్1 కేసులు రోజురోజుకు చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా తాజాగా 24 గంటల వ్యవధిలో 605 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,50,18,792కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,002 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
గత 24 గంటల వ్యవధిలో 648 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. మహమ్మారి నుంచి ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 44,481,341కి పెరిగిందని చెప్పారు. ఆదివారం రోజు ఒక్కరోజే నాలుగు మరణాలు నమోదయ్యాయని తెలిపారు. కేరళలో ఇద్దరు, కర్ణాటక, త్రిపురలో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు వివరించారు. దేశంలో కొవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,396కి చేరినట్లు పేర్కొన్నారు.
“ప్రస్తుతం దేశంలో 0.01 శాతం మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.81 శాతం కాగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. ఇక ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 220.67 కోట్ల (220,67,81,656) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశాం.” అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.