తమిళనాడులో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ జగత్ రక్షకన్పై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఆయనకు సంబంధించిన స్థలాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపడుతున్నారు. ఎంపీ ఇంటితో పాటు విద్యా సంస్థలు, ఆస్పత్రులు ఇతర ప్రదేశాల్లో తనిఖీలు జరుపుతున్నారు. అనేక కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన ఎంపీ.. నిబంధనల ప్రకారం ఆదాయ పన్నులు చెల్లించలేదన్న ఆరోపణలతో సోదాలు చేస్తున్నట్లు ఐటీ అధికారులు అంటున్నారు.
చెన్నైలో మొత్తం 40 ప్రదేశాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అడయార్‌లోని ఎంపీ ఇంటితో పాటు, తంబరం ప్రాంతంలోని భరత్ యూనివర్సిటీ కాలేజ్, పల్లవరంలోని వేలా ఆస్పత్రి, పల్లికరనై బాలాజీ మెడికల్ కాలేజ్, పూంతమల్లి సవిత ఆస్పత్రి, టీనగర్‌లోని నక్షత్ర ఇన్ హోటల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 50 మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. తనిఖీల నేపథ్యంలో భద్రత కోసం వెయ్యి మందికి పైగా సాయుధ పోలీసులను ఐటీ అధికారులు రంగంలోకి దించారు.