దేశంలో రిలయన్స్ జియో యూజర్ల సంఖ్య 45 కోట్లు దాటారని తెలిపారు ఆ సంస్థ చీఫ్ ముఖేష్ అంబానీ. రిలయన్స్ సంస్థ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సగటు వినియోగం నెలకు 25 జిబి కి చేరిందన్నారు. భారతదేశం అగ్రగామి దేశంగా ఎదుగుతుందని అన్నారు. నవ భారతం ఆత్మవిశ్వాసంతో నిండి ఉందన్నారు. భారత్ చారిత్రాత్మక జి20 సదస్సుకు వేదికైందని.. ఫైబర్ కేబుల్ అవసరం లేకుండా తీసుకువస్తున్న జియో ఎయిర్ ఫైబర్ ను సెప్టెంబర్ 19న లాంచ్ చేస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం ఐదు కోట్ల మంది జియో 5G యూజర్లు ఉన్నారని తెలిపారు ముకేశ్ అంబానీ. 4G వినియోగదారులంతా 5Gకి వెళ్లేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. 5G టెక్నాలజీ దేశంలో పలు సంస్కరణలు తీసుకువస్తుందని అన్నారు. భారత వస్తువుల ఎగుమతుల్లో రిలయన్స్ వాటా 9.3 శాతానికి పెరిగిందని, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రూ.1,271 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.