కేంద్రమంత్రి జేపీ నడ్డా రాజ్యసభా పక్షనేతగా నియామకం అయ్యారు. ప్రస్తుతం నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం లోక్ సభాపక్ష నేతగా ఉన్నా పీయూష్ గోయల్ ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. దీంతో, ఆయన స్థానాన్ని నడ్డా భర్తీ చేశారు. ఇకపోతే, నడ్డా మొదటిసారిగా ఏప్రిల్ 3, 2012న రాజ్యసభకు ఎన్నికయ్యారు. మరోవైపు, బీజేపీ చీఫ్ గా నడ్డా పదవీ కాలం ఈ నెలతో ముగియనుంది. కాగా.. ఏడాది చివర్లో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆయనే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని అధిష్ఠానం కోరినట్లుగా సమాచారం. అన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు 50 శాతం పూర్తయిన తర్వాతే కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటారని పార్టీ నిబంధనలు చెబుతున్నాయి. డిసెంబర్- జనవరిలో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.
2019 లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా.. కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన నడ్డా.. జనవరి 2020లో పూర్తిస్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవలే మంత్రివర్గంలో చేరిన ఆయన.. ప్రస్తుతం రాజ్యసభా పక్షనేతగా వ్యవహరించనున్నారు.