సందేశ్ ఖాలీ ఘటనలో ప్రధాన నిందితుడు షేక్ షాజహాన్ ప్రాంగణాల్లో విదేశీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో బీజేపీ స్పందించింది. పశ్చిమ బెంగాల్ లోని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని బీజేపీ నేత సువేంధు అధికారి డిమాండ్ చేశారు. అంతేగాక పార్టీ చీఫ్, సీఎం మమతా బెనర్జీని వెంటనే అరెస్టు చేయాలని తెలిపారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉపయోగిస్తూ టీఎంసీ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపించారు. షాజహాన్ లాంటి ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న టీఎంసీకి రాష్ట్రంలో అధికారంలో కొనసాగే హక్కు లేదన్నారు.
సందేశాలీలో దొరికినవన్నీ విదేశీ ఆయుధాలే. ఆర్డీఎక్స్ లాంటి పేలుడు పదార్థాలు భయంకరమైన దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో వినియోగిస్తారు. ఈ ఆయుధాలన్నీ అంతర్జాతీయ ఉగ్రవాదులే వాడుతారు. కాబట్టి టీఎంసీని వెంటనే ఉగ్ర సంస్థగా ప్రకటించాలి. సందేశ్ ఖాలీ ఘటనతో రాష్ట్ర ప్రజలంతా భయాందోళనలో ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. అధికారంలో కొనసాగే నైతిక హక్కును టీఎంసీ కోల్పోయిందని విమర్శించారు.