జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల వసూలుకు సంబంధించి కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. టోల్ ఛార్జీల వసూల్ కోసం జీపీఎస్ ఆధారిత వ్యవస్థను తీసుకురానున్నారు. దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి కల్లా ఈ విధానం అమల్లోకి రానున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీని వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయని తెలిపారు. అంతే కాకుండా జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ విధానం అందుబాటులోకి వస్తే టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు ఆపాల్సిన అవసరం ఉండదని కేంద్ర మంత్రి వివరించారు. వాహనాలు ఆపకుండా ఆటోమేటిక్ నంబర్‌ప్లేట్ రీడర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే రెండు పైలట్ ప్రాజెక్టులు చేపట్టామని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే లోపు బిల్డ్- ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ పద్ధతిన లక్షన్నర నుంచి రెండు లక్షల కోట్ల రోడ్ల ప్రాజెక్టులకు బిడ్లను ఆహ్వానించనున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. 2018-19లో టోల్‌ప్లాజాల వద్ద వేచి ఉండే సమయం సగటున 8 నిమిషాలుగా ఉండగా, ఫాస్టాగ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆ సమయం 47 సెకన్లకు తగ్గిందని అన్నారు.