కొత్త రాష్ట్ర‌ప‌తి ఎవ‌రంటే ?

-

ఆశ,ఆసక్తి,ఆందోళన…వెరసి భారత్ రాష్ట్రపతి ఎన్నిక…యావత్ ప్రపంచం దృష్టి ప్రస్తుతం భారత రాష్ట్రపతి ఎన్నికల పై ఉందనడం లో ఎలాంటి సందేహం లేదు.ఈ ఎన్నికకు అవసరమైన పూర్తి ఎలక్ట్రోరల్ ఓట‌ర్ల సంఖ్య భారతీయ జనతా పార్టీకి  చేకూరిన నేపథ్యంలో భారత ప్రథమ పౌరుడిని ఎంపిక చేసే విషయంలో ఆ పార్టీ ఆచి,తూచి వ్యవహరించాల్సి ఉంది.

ఈ కార‌ణంగానే బీజేపీ భావజాలానికి  అనుకూలంగా ఉన్న వారందరిలోనూ ఆశ, ఆసక్తి, ఆందోళన నెలకొని ఉన్నాయి.ఇటీవ‌ల కాలంలో మ‌న దేశ ఓటర్లు ప్రధాన మంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీకి పూర్తి స్థాయిలో మెజారిటీ (రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి) ఇచ్చిన విషయం స్పష్టమైన తరువాత అమెరికాలోని ప్రధాన పత్రికలలో ఈ దేశానికి సంబంధించిన వార్తలే ప్రముఖంగా కనిపించాయి.

ఉత్తర భారతావనిలో ఇటీవలి ఎన్నికలలో బీజేపీ విజయ దుందుభి మ్రోగించిన తరువాత అమెరికాలో న‌రేంద్ర‌మోడీ పై కొంత ఆసక్తికర చర్చ న‌డిచింది.భారత దేశంలో ప్ర‌జా ప్రభుత్వం రూపుదిద్దుకున్న తీరు,ప్ర‌జా స్వామ్య విధానాలు అమ‌ల‌వుతున్న తీరు అన్న‌వి ప్రధానాంశంగా చర్చలు సాగుతున్నాయి.అదే సమయంలో ప్రభుత్వం భారత దేశాన్ని ఏ  విధంగా ముందుకు నడిపిస్తున్నదన్న అంశాలు కూడా చర్చల్లో భాగంగా ఉన్నాయి.

 

భారత్ ను ఏలిన గత ప్రభుత్వాలు ఇక్కడి జనావళిలో నింపిన నిరాశ,నిస్పృహల తాలూకా చీకటి రోజులను రూపుమాపే దిశగా న‌రేంద్ర మోడీ తీసుకున్న చర్యలు, ఆయ‌న‌కు వెన్నుదన్నుగా నిలిచిన ఉత్తర ప్రదేశ్ పాలనాదక్షుడు యోగి ఆదిత్యనాథ్ శైలి భారత్ పేరును విదేశాలలో మార్మోగించింద‌ని చెప్పేందుకు ఎలాంటి సందేహం లేదు.ఎన్నడూ లేనంతగా విదేశీ మీడియా ఇటీవ‌ల జ‌రిగిన 5 రాష్ట్రాల ఎన్నికల మీద ఆసక్తి కనపరచింది.అటుపై కొద్ది మాసాల్లో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల మీద దృష్టి సారిస్తోంది.

ఇందుకు కారణం లేకపోలేదు.భారత్ లోని ప్రథమ పౌరుడుగా ఉండాలని ఈ దేశంలోని దిగ్గజ రాజకీయ నాయుకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ  పదవిని చేపట్టాలని భావిస్తున్న నేతలు తమకు పరిచయం ఉన్న బీజేపీ నేత‌ల‌తో, రాష్ట్రీ య స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.)నేతలతో కూడా లాబియింగ్  చేయిస్తున్నారు.

గతంలో ఎన్నడు కూడా రాష్ట్రపతి ఎన్నికకు పోటీ చేసే వ్యక్తి  ప్రచార కార్యక్రమాలను బహిరంగంగా,ఆర్భాటంగా  చేసింది లేదు.కానీ  రెెండు,మూడు దఫాలుగా రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ప్రచార పటాటోపాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో ప్రతిభా పాటిల్ ప్రచార ఆర్భాటాన్ని నిర్వహించారు.ఆ తరువాత  ఆ పదవికి పోటీ పడిన వారందరూ కూడా వివిధ రాష్ట్రాలలో పర్యటనలు చేప‌ట్ట‌డం,ఓటర్లైన ఎంపీలూ,ఎమ్మెల్యేల‌తో విందు సమావేశాలు నిర్వ‌హించడం వంటి ప‌నులెన్నో చేశారు.

వాస్త‌వానికి రాష్ట్ర‌ప‌తి ఎన్నిక బీజేపీకి ఓ అగ్ని పరీక్షే.ఎందుకంటే ఈ పదవికి స్వంత పార్టీలోనూ,తమ పార్టీకి అనుకూలంగా ఉన్న మిత్ర పక్ష, ప్రతిపక్ష నేతలనూ ఒప్పించడం తలకు మించిన భారం కాగలదు.అయినప్పటికీ ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప్రభుత్వం ఆశావ‌హుల‌ను దృష్టిలో ఉంచుకుని మేలిమి వ్య‌క్తికి అనుగుణంగా,అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనే భావన సర్వత్రా వినిపిస్తోంది.భారత్  రాజకీయాలను ఒకసారి పరిశీలిస్తే..ఉప రాష్ట్రపతి గా పని చేసిన వ్యక్తి రాష్ట్రపతిగా పదోన్నతి పొందుతారు. గతంలా చాలా మంది ఇదేవిధంగా పదోన్నతి పొందిన వారున్నారు.ఆ  కోణంలో నుంచి చూస్తే రాజనీతిజ్ఞుడిగా,చాణక్యుడిగా,వివిధ ప్రతిపక్ష పార్టీలకు ఇష్టుడిగా పేరుపొందిన ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రథమ పౌరుడిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రపతి పదవిలో ఉన్న రామ్ నాథ్ కోవింద్ కూడా మరో దఫా ఈ పదవిలో కొనసాగాలని భావిస్తున్నట్లు రాష్ట్రపతి  భవన్ వర్గాల సమాచారం.భారతీయ జనతా పార్టీ గతంలో మైనార్జీలను అక్కున చేర్చుకునే యత్నంలో భాగంగా  ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అబ్దుల్ కలాంను  దేశ ప్రథమ పౌరుడ్ని చేసింది.ఇటీవల ముగిసిన ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు  రాష్ట్రపతి పదవికి బీజేపీ శ్రేణులు చాప కింద నీరులా ఒక ప్రచారం సాగించాయి.అదేమిటంటే తమ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా  సీనియర్ కాంగ్రెస్ నేత గులాంనబీ అజాద్ ఉంటారన్నది వాటి సారాంశం.

ఇది ఆ ఎన్నికలలో ముస్లిం ఓట్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం అని కొందరు  రాజకీయ పరిశీలకులు పేర్కొన్నారు.కానీ రాజకీయ మేథావుల మాటలు వారి పెదని నుంచి దాటి రేలేకపోయాయి.ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వార్తాస్రవంతుల కాలం నడుస్తున్నది ఇది మీడియా  విశృంఖలత్వం కావచ్చు లేదా,దుందుడుకు చర్య కావచ్చు.ఎవరి అనుకూలమైన మీడియా వారికి అనుకూలమైన నేతలను రాష్ట్రపతి అభ్యర్థి ఫ‌లానా వాడేనని పేర్కొంటోంది.రాజకీయ నేతల సహజ గుణం ఏమిటంటే తమ మదిలోని మాట మరొకరికి తెలియనివ్వక పోవడం.దేశ ప్రథమ పౌరుడ్ని నిలబెట్టే నేతలు కూడా అదే సరళిలో ఉండారనే విషయం మనమిక్కడ మరువరాదు.

– శ్రీ‌ధ‌ర్ వెన్నెల‌కంటి,సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్,నెల్లూరు 

Read more RELATED
Recommended to you

Latest news