వికారాబాద్ టీఆర్ఎస్ గ్రూప్ వార్ కొత్త మలుపు తిరిగిందా?

-

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వికారాబాద్ జిల్లా తాండూరు పేరు ఒక్కసారిగా రాజకీయవర్గాల్లో చర్చకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ వర్గపోరు పతాక స్థాయికి చేరింది. ఏ చిన్న అవకాశం దొరికినా పైచెయ్యి సాధించేందుకు నాయకులు పావులు కదుపుతున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరపైకి వచ్చిన కొత్త సమస్య ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతుంది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్న దొంగ ఓటు వేశారని కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం వెనుక టీఆర్ఎస్ లోని ఓ వర్గం కీలకపాత్ర పోషించిందన్న ప్రచారంతో వికారాబాద్ టీఆర్ఎస్ గ్రూప్ వార్ కొత్త మలుపు తిరిగింది. కాంగ్రెస్ ఫిర్యాదు వెనక టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డే ఉన్నారని జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన రోహిత్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరినప్పటి నుంచి వికారాబాద్ జిల్లా పార్టీలో గ్రూపులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే వర్గం, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వర్గం, మంత్రి సబిత వర్గం, ఎంపీ రంజిత్‌రెడ్డి వర్గాలుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు విడిపోయారు.

తాండూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ స్వప్న ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి శిబిరంలో ఉన్నారు. అందుకే ఎమ్మెల్యేపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు స్వప్నపై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌ నాయకులే.. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని కూడా టార్గెట్‌ చేశారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రోహిత్‌రెడ్డి ఓటేశారు. అయితే ఆయన పట్టభద్రుడే కాదని ఆరోపిస్తూ.. కొన్ని వివరాలను కలెక్టర్‌కు అందజేశారట. పట్టభద్రుడు కాకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన రోహిత్‌రెడ్డిని ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ఫిర్యాదులు చేసుకోవడం కొన్ని సందర్భాల్లో భౌతిక దాడులకు దిగేందుకు వెనకాడటం లేదు.

మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ నుంచి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వరకు ఈ ఫిర్యాదుల పరంపర చేరుకోవడంతో దీని వెనక ఉన్న అంశాలపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేపై కాంగ్రెస్‌ ఫిర్యాదు వెనక ఎమ్మెల్సీ పట్నం ఉన్నట్టు చర్చ మొదలైంది. ఒకరికొకరు ప్రతీకారం తీర్చుకునేలా ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటున్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు. ఎమ్మెల్సీగా వాణిదేవి గెలిచినప్పుడు నిర్వహించిన సంబరాల్లోనూ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. సరస్పరం దాడులు చేసుకున్నారు. తాండూరు గొడవలపై టీఆర్‌ఎస్‌ పెద్దలు ఎన్ని సార్లు దృష్టి పెట్టిన ఇక్కడ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news