గెలుపు ఓటములు అన్నవి సహజాతి సహజం.ఇదే మాట ఓ కేంద్రం మంత్రి హోదాలో నితిన్ గడ్కరీ తన ప్రత్యర్థి పార్టీకి చెబుతున్నారు. వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో లభ్యం అయ్యే మాటలను ఆయన మరో మారు చెబుతూ యువ రాజు రాహుల్ లోనూ, అధినేత్రి సోనియాలోనూ కొత్త ఉత్సాహం నింపుతున్నారు. ఈమాటలే దేశ రాజధానిలో ఆసక్తి రేపుతున్నాయి. చర్చకు తావిస్తున్నాయి. ఎందుకంటే ఏడేళ్లుగా కాంగ్రెస్ ఎటువంటి ఎదుగూబొదుగూ లేకుండా ఉంది. అంతేకాకుండా జాతీయ పార్టీ అన్న ఉనికిని కూడా త్వరలోనే కోల్పోనుంది.ఈ నేపథ్యాన బీజేపీ లీడర్ మరియు కేంద్ర మంత్రి అయిన గడ్కరీ చెప్పే హిత వాక్యాలు ఏ మేరకు పనిచేస్తాయో ?
గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ డోలాయమాన స్థితిలో ఉంది. ఏం చేసినా కూడా కోలుకోలేని స్థితిలో ఉంది. ఐదు రాష్ట్రాల ఫలితాల తరువాత కాంగ్రెస్ ఇంకా కోలుకోలేని స్థితిలో ఉంది. ఈ దశలో నాయకత్వ మార్పు అనివార్యం అని భావిస్తున్నారు. అలా అని రాహుల్ స్థానంలో వేరొకరెవ్వరయినా సరిపోతారా అంటే ఆ ప్రశ్నకు కూడా సమాధానం రావడం లేదు.
ఓ దశలో సోనియా కూడా తప్పుకుని తీరాలని భావించినా అది కూడా కుదరలేదు. ఈ స్థితిలో కాంగ్రెస్ కు కొన్ని ధైర్య వచనాలు చెప్పారు నితిన్ గడ్కరీ. బలమైన కాంగ్రెస్ పార్టీ ప్రజా స్వామ్యానికి అవసరం అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. బలమైన ప్రతిపక్ష హోదాలో ఉంటూ ప్రజా స్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఓటములు ఎదురయినప్పటికీ నిరాశ చెందక పార్టీ పటిష్టానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు.
ఎందుకంటే గత కొద్దికాలంగా బీజేపీ ని తీవ్ర స్థాయిలో ఎదుర్కొనే స్థితిలో కాంగ్రెస్ లేదు.రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టి పోరాటం చేస్తున్నా ఫలితాలు రావడం లేదు. ముఖ్యంగా అసమ్మతి బెడద బాగా ఉంది.ఈ దశలో పార్టీ పూర్వ వైభవం దక్కించుకోవాలని అంతా ఆశించిన విధంగానే నితిన్ గడ్కరీ కూడా ఆశించారు. కాంగ్రెస్ పార్టీ నేత నెహ్రూ కూడా వాజ్ పేయ్ ని ఎంతో గౌరవంగా చూశారని గుర్తు చేసుకున్నారు. ఆనాడు ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా కూడా నెహ్రూ మాత్రం ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారని కూడా ప్రస్తావించారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది.