శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా ఆమె పలు పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. అయితే నేడు ఆమె భద్రాద్రి ఆలయాన్ని సందర్శించున్నారు. అలాగే.. ఈ నెల 30వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి యాదగిరిగుట్ట వస్తున్న నేపథ్యంలో.. భద్రతా కారణాలతో ఉదయం సుప్రభాత సేవ నుంచి మధ్యాహ్నం నివేదన వరకు స్వామివారి దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈఓ గీతారెడ్డి తెలిపారు. ధర్మదర్శనాలు, వీఐపీ, బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు కూడా మధ్యాహ్నం వరకు రద్దు చేస్తున్నామన్నారు. అంతర్గతంగా స్వామివారికి నిత్య పూజలు, కైంకర్యాలు యథాతథంగా జరుగుతాయన్నారు. రాష్ట్రపతి తిరిగి హైదరాబాద్ తిరుగుప్రయాణమయ్యే వరకు ఎలాంటి దర్శనాలు ఉండవన్నారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 4:30 నుంచి 5:15 గంటల వరకు ఆండాళ్ అమ్మవారికి తిరుప్పావై వేడుకలను నిర్వహించారు. భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.40,46,863 ఆదాయం వచ్చింది. ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.16,05,780, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.5 లక్షలు, వీఐపీ దర్శనాలతో రూ.3.90 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.3,18,900, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.3,06,878 ఇన్ కమ్ వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు.