గతంలో బలమైన ప్రభుత్వమంటే ప్రతి దానిని, ప్రతి ఒక్కరిని నియంత్రించాలనేలా ఉండేదని, ఆ పద్ధతిని తాము మార్చామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వ్యవస్థల్లో జోక్యం చేసుకోవడమనే అపప్రధను తాము తొలగించామని వివరించారు.
‘మా హయాంలోని బలమైన ప్రభుత్వం ఎవరినీ, దేన్నీ నియంత్రించదు. బలమైన ప్రభుత్వం మిమ్మల్ని అడ్డుకోదు. బాధ్యతగా ప్రతిస్పందిస్తుంది. ఇలా ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేలా సంస్కరణలు తీసుకొచ్చాం’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. యువత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేలా కొత్త విద్యావిధానం తీసుకొచ్చామని తెలిపారు.
శుక్రవారం చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయం 42వ స్నాతకోత్సవంలో ఆయన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. యువతకు, విద్యార్థులకు దేశంలో ఇప్పుడెన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సాంకేతిక ఆవిష్కరణల కోసం దేశం ఎదురుచూస్తోందని చెప్పారు. డిజిటల్ లావాదేవీల్లో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహిస్తోందన్నారు. ఇప్పుడు యువత కొత్త ఆలోచనలతో స్టార్టప్‌లను పెట్టే దిశగా వెళ్తున్నారని తెలిపారు.