భారత కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైన వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ భవనానికి సంబంధించిన ఒక అద్భుతమైన వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ చారిత్రక భవనాన్ని మే 28న ప్రధాని మోడీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునాతన హంగులతో కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఈ భవన నిర్మాణం పూర్తయింది. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ నూతన పార్లమెంటుకు సంబంధించిన వీడియోను ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. నూతన పార్లమెంట్ భవనం భారతీయ పౌరులందరూ గర్వించేలా ఉంటుందని పేర్కొంటూ #myparliament#mypride హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.
ఈ వీడియోను ‘మై పార్లమెంట్ – మై ప్రైడ్’ అనే హాష్ ట్యాగ్ తో సొంత వాయిస్ ఓవర్ ను జోడించి షేర్ చేయాలని ప్రజలను కోరారు. పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం తెల్లవారుజామున హవన్, సర్వమత ప్రార్థనలతో షురూ అవుతుంది. అనంతరం ప్రధాని మోడీ లోక్ సభను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి 25 రాజకీయ పార్టీలు హాజరయ్యే అవకాశం ఉంది. దీన్ని బహిష్కరించాలని 21 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే పార్టీలు బీజేపీ, ఏఐడీఎంకే, అప్నాదళ్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, శివసేన (షిండే వర్గం), ఎన్ పీపీ, ఎన్ పీఎఫ్, బిజూ జనతాదళ్, టీడీపీ, వైఎస్సార్ సీపీ, అకాలిదళ్, బీఎస్పీ, జేడీఎస్.