ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్‌ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సమావేశం జరుగుతున్న సమయం లో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నాయకులు కర్నె ప్రభాకర్ కు ఊహించని షాక్ తగిలింది. టీఆర్‌ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ భవన్ లోకి… కర్నె ప్రభాకర్ ను పోలీసులు అనుమతించలేదు.
ఎంత చెప్పినా వినిపించుకోని అక్కడి పోలీసులు… లిస్టులో పేరు లేదంటూ…తెలంగాణ భవన్ లోకి వెళ్లకుండా కర్నె ప్రభాకర్ ను అడ్డుకున్నారు. ఈ నేపథ్యం లో తెలంగాణ భవన్ ఇన్ చార్జీ.. శ్రీనివాస్ రెడ్డికి కర్నె ప్రభాకర్ ఫోన్ చేశారు. అయితే.. ఆ సమయంలో కర్నె ప్రభాకర్ ఫోన్ ను లిఫ్ట్ చేయలేదు శ్రీనివాస్ రెడ్డి.
ఈ తరుణంలో తెలంగాణ భవన్ నుంచి వచ్చిన కొందరు నేతలు.. కర్నె ప్రభాకర్ ను లోపలికి పంపించాలని చెప్పారు. దీంతో కర్నె ప్రభాకర్ ను తెలంగాణ భవన్ లోకి అనుమతి ఇచ్చారు పోలీసులు. ప్రస్తుతం ఆయన టీఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఇక పోలీసుల తీరుపై ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యమ నాయకుడికే ఇలాంటి అన్యాయం జరగడమేంటని ప్రశ్నిస్తున్నారు.