రాజకీయాలు రోజురోజుకూ మరీ దారుణంగా తయారవుతున్నాయి…రాజకీయ నేతలు మాటలు హద్దులు దాటి రాజకీయాలని గబ్బు పట్టిస్తున్నారు. ఎక్కడైనా సరే రాజకీయ ప్రత్యర్ధులు నిర్మాణాత్మకమైన విమర్శలు చేసుకోవాలి…అదే నిజమైన రాజకీయం…కానీ నేడు రాజకీయాల్లో విమర్శలు ఉండటం లేదు…ఏకంగా బూతులే….నేతలు నోరు తెరిస్తే చాలు బూతులతో ప్రత్యర్ధులపై రెచ్చిపోతున్నారు. ఈ బూతుల రాజకీయం కేవలం ఒక రాష్ట్రంలోనే కాదు..దేశవ్యాప్తంగా అలాగే ఉంది.
పైగా ఇటీవల నేతలు హద్దులు దాటి నేతల కుటుంబ సభ్యులని ఉద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు…ఆ మధ్య ఏపీలో వైసీపీ నేతలు…చంద్రబాబుని ఉద్దేశించి లోకేష్ ఎలా పుట్టాడంటూ దారుణమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా అసోం సీఎం…రాహుల్ గాంధీ పుట్టుకపై దారుణంగా మాట్లాడారు. రాజకీయాల్లో ఇలాంటి వ్యాఖ్యలు సరికావు అనే చెప్పాలి…అసలు ఇలాంటి మాటలు మాట్లాడేవారు మనషులు అని చెప్పుకోవడానికి లేదు.
అయితే ఇలా బూతుల రాజకీయం ఏపీలోనే కాదు…తెలంగాణలో కూడా నడుస్తోంది..ఇక తాజాగా రాజకీయం మరింత దారుణంగా తయారయ్యి పిండాల రాజకీయం వైపు వెళ్లింది. తాజాగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..కేసీఆర్ పుట్టిన రోజుని ఉద్దేశించి దారుణమైన విమర్శలు చేశారు. మూడు రోజుల పాటు కేసీఆర్ పుట్టినరోజు చేయాలని టీఆర్ఎస్ శ్రేణులు నిర్ణయించుకున్నాయి…దీనిపై రేవంత్ స్పందిస్తూ… మూడు రోజులు బర్త్ డే వేడుకలు చేసుకుంటారో లేక..12 రోజుల దినం చేసుకుంటారో మాకు అభ్యంతరం లేదని.. మీదగ్గర డబ్బులు ఉన్నాయని మాట్లాడారు. రాజకీయంగా మాట్లాడితే ఇబ్బంది లేదు గాని…ఇలా ఒకరి చావు గురించి మాట్లాడటం అనేది దారుణమైన విషయమని చెప్పొచ్చు.
సరే రేవంత్ నోరు జారారు అని అనుకుంటే…టీఆర్ఎస్ నేతలు మరింత ముందుకు వెళ్ళి ఏకంగా రేవంత్‌కు పిండ ప్రధానం చేశారు. టీఆర్ఎస్ ఐటీ సెల్ ఏకంగా రేవంత్ రెడ్డి చిత్రపటంతో వెళ్లి ఆయన పిండాలను మూసీ నదిలో కలిపి వారి నిరసనను వ్యక్తం చేశారు. ఇలా రాజకీయ పార్టీలు మరీ దారుణమైన రాజకీయాలని చేస్తూ ముందుకెళుతున్నాయి.