మళ్ళీ బై బై బాబు..జగన్‌ని నమ్ముతారా?

-

2019 ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్న జగన్..అధికారంలో ఉన్న చంద్రబాబుని గద్దె దించడానికి ఎలాంటి రాజకీయ ఎత్తులతో రాజకీయం చేశారో చెప్పాల్సిన పని లేదు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో జగన్ తనదైన శైలిలో ముందుకెళ్లారు. ఇక ప్రజల్లో చంద్రబాబుని ఎంత నెగిటివ్ చేయాలో అంతా చేశారు. అయితే వాటిలో నిజాలు ఉన్నాయి..అబద్దాలు కూడా ఉన్నాయి.

ఏదైతే ఏముంది చివరికి 2019 ఎన్నికల్లో జగన్ గెలిచి అధికారంలోకి వచ్చారు. చంద్రబాబుపై నెగిటివ్, జగన్‌పై పాజిటివ్ తో ప్రజలు ఏకపక్షంగా వైసీపీకి ఓట్లు వేసి భారీగా సీట్లు ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ నినాదం ఒకటే ‘బై బై బాబు’ అంటూ ప్రజల్లోకి వెళ్లారు. ఇక వైసీపీ నినాదం సక్సెస్ అయింది..ప్రజలు బాబుని గద్దె దించి జగన్‌ని గద్దె ఎక్కించారు. అయితే ఇప్పుడు జగన్ పాలన ఎలా ఉందో ప్రజలు చూస్తున్నారు. మరి జగన్ పాలనలో ప్రజలు అంతా ఆనందంగా ఉన్నారా? అంటే ఆ విషయం జగన్ పాలన చూస్తున్న ప్రజలకే తెలియాలి అని చెప్పొచ్చు.

అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ మరోసారి కూడా అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఈ సారి 175కి 175 సీట్లు గెలవాలని అంటున్నారు. ఈ ఒక్కసారి గెలిస్తే మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల టార్గెట్ గా జగన్ విమర్శలు ఉంటున్నాయి. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు తనవైపే ఉన్నారని అంటున్నారు.

ఇదే క్రమంలో మరోసారి బై బై బాబు నినాదంతో జగన్ ముందుకొస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట సభలో మాట్లాడుతూ.. భార్యతో సంసారం చేసే వారిని శ్రీరాముడు అంటామని.. పరాయి మహిళను ఎత్తుకెళ్లే వాడిని రావణుడు అంటామని.. మరి సొంత మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన వారిని ఏమంటారని బాబుని ఉద్దేశించి మాట్లాడారు.

చంద్రబాబుకు ‘‘బై బై బాబు…. మీ సేవలు మాకొద్దు’’.. అని చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. రాజకీయాలు చెడిపోయాయని, తాను దుష్ట చతుష్టయంను నమ్మకోలేదని… దేవుడి దయ, ప్రజలను నమ్ముకున్నానని అన్నారు. ఐదేళ్లు పవన్, చంద్రబాబు సంసారం చేశారని ఫైర్ అయ్యారు. అయితే మరోసారి జగన్ బై బై బాబు నినాదం అందుకున్నారు. మరి ఈ నినాదం ఈ సారి సక్సెస్ అవుతుందా? అంటే డౌటే అని చెప్పొచ్చు. అలాగే ఎప్పుడో ఎన్టీఆర్‌ని గద్దె దించిన ఎపిసోడ్‌తో వెన్నుపోటు అంటూ బాబుని విమర్శిస్తున్నారు. ఈ వెన్నుపోటు ఎపిసోడ్‌ని ప్రజలు పట్టించుకోవడం కష్టమే. ఇక పదే పదే టీడీపీ అనుకూల మీడియాని దుష్టచతుష్టయం అంటున్నారు..కానీ వైసీపీ అనుకూల మీడియాని జగన్ మరిచిపోతున్నారు. వైసీపీకి అనుకూలమైన మీడియా అసలు లేనే లేనట్లు చెబుతున్నారు. ఇక రాజకీయాలు చెడిపోయాయని అంటున్నారు..అది అందరు రాజకీయ నేతల వల్లే అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news