గత ఎన్నికల ముందు పాదయాత్ర చేసే సమయంలో జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలో మద్యపాన నిషేధం ఒకటి. మద్యం వల్ల అనేక కుటుంబాలు నాశనమైపోతున్నాయని, ఇంట్లో మగవాళ్ళు మద్యానికి బానిసలుగా మారడం వల్ల అక్కాచెల్లెళ్ల పడుతున్న కష్టాన్ని చూసి, జగన్ దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చారు.
అలాగే అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధంలో భాగంగా మొదట బెల్టు షాపులు క్లోజ్ చేశారు. అలాగే వైన్ షాపుల సంఖ్య దాదాపు 33 శాతం తగ్గించి, మిగిలిన షాపులని ప్రభుత్వమే నడపటం మొదలుపెట్టింది. ఇంకా అందులో నిరుద్యోగులకు అవకాశం ఇచ్చింది. అలాగే మద్యం ధరలని విపరీతంగా పెంచేశారు. అలా పెంచితే మందు తాగేవాళ్లు తగ్గుతారని ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
అయితే దీనిపై ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేసుకుంటూనే వచ్చింది. మద్యం ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచారని మాట్లాడారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వమే కొత్త కొత్త బ్రాండ్లు తయారుచేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటుందని విమర్శలు చేశారు. ఇక వైన్ షాపుల పేరిట వైసీపీ నేతలు భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా ముందుకెళుతుంది.
మద్యపాన నిషేధంపై వెనక్కి తగ్గేది లేదని చెప్పుకుంటూ వస్తుంది. కానీ తాజాగా జగన్ ప్రభుత్వం మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని షూరిటీ గా పెట్టి 25 వేల కోట్లు అప్పు తీసుకొచ్చిందని పిఏసి ఛైర్మన్ పయ్యావుల కేశవ్ బయటపెట్టారు. 15 ఏళ్ల పాటు మద్యం ఆదాయం షూరిటీ గా పెట్టి ఈ అప్పు తీసుకొచ్చారు. అంటే దీన్ని బట్టి చూస్తే అన్ని వేల కోట్ల అప్పులు తీరాలంటే మద్యమే ప్రధానం. దీని బట్టి చూస్తే మద్యపాన నిషేధం ఉండదని చెబుతున్నారు. జగన్ అధికారంలో ఉండగా మద్యపాన నిషేధం జరగడం కష్టమని అంటున్నారు.