బీజేపీలో భారీ కుదుపు..రాజగోపాల్‌ కాంగ్రెస్‌లోకి..ఆ నేతలు టచ్‌లోనే?

-

కాంగ్రెస్ లోకి వలసలు జోరు కొనసాగుతుంది. తెలంగాణలో ఈ సారి ఖచ్చితంగా అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్న కాంగ్రెస్ పార్టీ..తమ బలాన్ని పెంచుకునే దిశగా సాగుతుంది. ఈ క్రమంలోనే బి‌ఆర్‌ఎస్ లోని కీలక నేతలు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లోకి వచ్చారు. జులై 2న రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో పాటు కొందరు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు.

అదే సమయంలో బి‌జే‌పిలో ఉన్న కీలక నేతలు సైతం కాంగ్రెస్ లోకి వస్తున్నారనే ప్రచారం మొదలైంది. గతంలో కాంగ్రెస్ లో నుంచి బి‌జే‌పిలోకి వెళ్ళిన నేతలు అక్కడ ఇమడలేక..పైగా బి‌జే‌పికి సరైన బలం లేకపోవడంతో వారు మళ్ళీ కాంగ్రెస్ లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో గత ఏడాది కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బి‌జే‌పిలోకి వెళ్ళి మునుగోడు ఉపఎన్నిక బరిలో ఓడిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తున్నారనే ప్రచారం మొదలైంది.

ఈ క్రమంలోనే రాజగోపాల్ కాంగ్రెస్ లో చేరడం ఖాయమని… తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌ రావు ఠాక్రే, సహ ఇన్‌చార్జి రోహిత్‌ చౌధురి ధ్రువీకరించారు. అటు బీజేపీ ముఖ్యనేతలు ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ విజయశాంతితో చర్చలు జరుగుతున్నాయని అన్నారు.

దీంతో బి‌జే‌పిలో భారీ కుదుపు ఖాయమనే ప్రచారం మొదలైంది. కానీ ఇప్పటికే ఈటల ప్రెస్ మీట్ పెట్టి తాను పార్టీ మారే ప్రసక్తి లేదని అన్నారు. కాకపోతే అంతర్గతంగా ఈటల తన అనుచరులతో పార్టీ మార్పుపై చర్చలు జరుపుతున్నారనే ప్రచారం ఉంది. అటు దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో పనిచేసి..తర్వాత బి‌జే‌పిలోకి వెళ్ళిన డి‌కే అరుణ సైతం..మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం ఉంది. చూడాలి మరి ఎంతమంది బి‌జే‌పి నేతలు కాంగ్రెస్ లోకి వస్తారో.

Read more RELATED
Recommended to you

Latest news